ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ స్థలంలా మారిన మార్కెట్ యార్డ్..

మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిత్యం తాగుబోతుల అడ్డాగా తయారయ్యింది.

Update: 2025-01-06 03:45 GMT

దిశ, బోథ్ : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిత్యం తాగుబోతుల అడ్డాగా తయారయ్యింది. మద్యం ప్రియులు చీకటి అయ్యిందంటే చాలు అర్ధరాత్రి వరకు మద్యం తాగి అక్కడే మందు బాటిళ్లు, తినుబండారాల కవర్లు ఇష్టం వచ్చినట్లు పడేసి వెళ్తున్నారు. ఉదయం పూట మార్కెట్ యార్డులో వాకింగ్ కోసం వచ్చేవారు నిత్యం ఈ మందు బాటిళ్లను చూసి బోథ్ మార్కెట్ యార్డ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారయ్యిందని వాపోతున్నారు. అంతేగాకుండా మార్కెట్ యార్డు స్థలం ప్రైవేటు వాహనాల అడ్డగా తయారయ్యింది.

పట్టించుకోని అధికారులు..

మండల కేంద్రానికి కేంద్ర బిందువైన మార్కెట్ యార్డ్ లో సీసీ కెమెరాలు ఉన్న అవి పని చేయవు. పంటల కొనుగోలు సమయంలో సోయల బ్యాగులు పోయిన సందర్భాలు ఉన్నాయి. అర్ధరాత్రి వరకు మార్కెట్ యార్డ్ లో మద్యం తాగి అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే తప్ప అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరా అని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయమై బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగా రెడ్డిని వివరణ కోరగా త్వరలోనే సీసీ కెమెరాలు బాగు చేయిస్తామని, సెక్యూరిటీ గార్డును పెడతామని అన్నారు.


Similar News