Viral fever:పొంచి ఉన్న ప్రమాదం..విజృంభించనున్న వైరల్ జ్వరాలు

భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జ్వరాల తీవ్రత మరింత పెరుగుతుంది.

Update: 2024-09-04 02:22 GMT

దిశ ప్రతినిధి,నిర్మల్:భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జ్వరాల తీవ్రత మరింత పెరుగుతుంది. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన లేమితో పాటు వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో వ్యాధుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. భారీ వర్షాలు పడి వాతావరణం కుదుటపడితే జ్వరాల తీవ్రత కొంత తగ్గుతుందని..కానీ వర్షాలు ముసురు పట్టి పడుతుండడంతో పల్లెలు జ్వరాలతో వణికిపోతున్నాయి. ఈ తీవ్రత వచ్చే వారం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. గడిచిన నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉండగా జనజీవనం స్తంభించింది. ఎండ ప్రభావమే లేకుండా పోవడంతో వాతావరణంలో భిన్న రకాల వైరస్‌లు పెరిగిపోయి పలు రకాల రోగాలకు కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా జ్వరాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రైవేటు ఆసుపత్రులు కిటకిట..

కొద్ది రోజులుగా జ్వరాలు తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్నగర్, ఉట్నూర్, బోథ్, ఇచ్చోడ, భైంసా, ఖానాపూర్ తదితర పట్టణాల్లో నడుస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. పేరున్న ఆసుపత్రులు, జ్వరం నిపుణులు, పిల్లల దవాఖానాలు ఎటు చూసినా రోగులతో నిండి కనిపిస్తున్నాయి. అనేక ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది.

దీంతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సైతం అపసోపాలు పడుతున్నాయి. కీటక జనిత రోగాలైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్‌తో పాటు వర్షాల కారణంగా డయేరియా, ఇతర జీర్ణకోశ సంబంధ వ్యాధులు విపరీతంగా ప్రబలుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు మందులు, ఇన్ పేషెంట్ సేవల పేరుతో రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై పలు ఫిర్యాదులు కూడా ఉన్నతాధికారులకు వెళ్లాయి.

పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులు..!

భారీ వరదలు, ముసురు వానల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జ్వరాల తీవ్రత పెరుగుతుంది. ప్రధానంగా డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల జిల్లాలో కొంతకాలంగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సమాచారం వెలుగులోకి వస్తున్నది. మొన్నటిదాకా అసలు మలేరియా జ్వరాల ప్రభావమే లేకపోగా తాజాగా..మంచిర్యాల జిల్లాలోని తాండూరు, బెల్లంపల్లి, తిర్యానితో పాటు పలు మండలాల్లో మలేరియా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆరోగ్య శాఖలో ఆందోళన మొదలైంది. ఇక పశ్చిమ ప్రాంతమైన ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో డెంగ్యూ జ్వరాల తీవ్రత విపరీతంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల, ఉట్నూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి, నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రి, భైంసా ఖానాపూర్ ఏరియా ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.

ఆరోగ్య శాఖ అప్రమత్తం..

ఉమ్మడి జిల్లాలో వర్షాల కారణంగా పెరుగుతున్న జ్వరం తీవ్రతను తగ్గించేందుకు ఆరోగ్యశాఖ ప్రణాళికను తయారు చేసి చర్యలు తీసుకుంటున్నది. వరద ముంపు ప్రాంతాల నుంచి జనాలను తరలించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. అక్కడే జ్వరాల తీవ్రత పెరగకుండా వారికి చికిత్స అందజేస్తున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి సెంటర్లతో పాటు ఆరోగ్య శిబిరాలను సమీక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో జ్వరాల తీవ్రతతో పాటు ప్రజారోగ్య సేవల పై మంగళవారం పర్యటించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పీహెచ్‌సీలలో మందుల కొరత..?

అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత రోగులను వేధిస్తున్నది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి సరఫరా లేని కారణంగా పీహెచ్సీలలో మందుల కొరత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు వెంటనే ఈ సమస్య పరిష్కారం కోసం జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నారు. తక్షణమే మందుల సరఫరా పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రానికి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా కేంద్ర ఆస్పత్రులకు మందుల నిల్వలు చేరుకునే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.


Similar News