‘‘అమ్మాయిని పంపిస్తే పాల వ్యాపారాన్ని విస్తరిస్తా’’.. బట్టబయలైన BRS MLA రాసలీలలు
‘‘అమ్మాయిని పంపించు పాల వ్యాపారాన్ని విస్తరించేందుకు సహకరిస్తా.. అన్ని నేనే చూసుకుంటా.. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది’’ అంటూ ఓ మహిళా వ్యాపారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే
దిశ, ప్రతినిధి నిర్మల్: ‘‘అమ్మాయిని పంపించు పాల వ్యాపారాన్ని విస్తరించేందుకు సహకరిస్తా.. అన్ని నేనే చూసుకుంటా.. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది’’ అంటూ ఓ మహిళా వ్యాపారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన హెచ్చరికపై బాధితురాలు విడుదల చేసిన ఆడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. గతంలోనే పలు వివాదాలకు కేంద్ర బిందువైన ఆ ఎమ్మెల్యే.. తాజాగా రాసలీలల వివాదంలో చిక్కుకున్నారు. ఓ డెయిరీ సంస్థ ప్రధాన భాగస్వామి అయిన మహిళ విడుదల చేసిన ఆడియో ప్రకారం.. మంచిర్యాల జిల్లాలో పాల ఉత్పత్తి కోసం భారీ ఎత్తున వ్యాపారం ప్రారంభించారు.
ఇందుకు సంబంధించి తానే స్వయంగా రెండు ఎకరాల స్థలాన్ని కూడా ఇచ్చానని ఎమ్మెల్యే తమకు చెప్పాడని ఆమె ఆరోపించారు. ఈ సంస్థను విస్తరించే క్రమంలో పలుసార్లు తాము ఎమ్మెల్యేను కలిసామని చెప్పారు. అయితే ఒకసారి తాను ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లిన సమయంలో తమ కంపెనీలో పని చేసే ఓ యువతిని తన వెంట తీసుకువెళ్లగా.. ఆ అమ్మాయిని తన వద్దకు పంపాలని పలుమార్లు ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు.
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశం ఉందని పిలిచి అక్కడ ఆల్కహాల్ పెట్టి తమను తాగమని ఒత్తిడి చేశారని.. తనకు అలాంటి అలవాటు లేదని చెప్పినప్పటికీ.. ఎమ్మెల్యే తమపై తీవ్రంగా ఒత్తిడి చేశాడని ఆ ఆడియోలో పేర్కొన్నారు. వ్యాపార విస్తరణకు సహకరిస్తానని, తాను చెప్పినట్లు వినాలని కొంతమంది భాగస్వాములను అందులో సభ్యులుగా చేర్చుకోవాలని రకరకాలుగా వేధింపులకు గురి చేసినట్లు ఆమె ఆరోపించారు.
తాజాగా తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన అన్యాయాన్ని వివరిస్తే పోలీసులు తనకు సహకరించలేదని చెప్పారు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణభయం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఆ మహిళ విడుదల చేసిన ఆడియో వ్యవహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే ఈ వివాదంలో చిక్కుకోవడం రాజకీయంగా అధికార పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేలా చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలోనూ వివాదాలే..
సదరు ఎమ్మెల్యే గతంలోనూ అనేక వివాదాల్లో తలదూర్చారు. పలు భూ వివాదాలతో పాటు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి వ్యవహారంలోనూ ఆయన వివాదాస్పద నేతగా ముద్రపడ్డారు. తాజాగా అమ్మాయిలను పంపించాలని ఓ కంపెనీ నిర్వాహకురాలు తనపై ఒత్తిడి తెచ్చి వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ ఆడియో విడుదల చేయడం తీవ్ర వివాదానికి కారణం అవుతోంది. తాజా వ్యవహారం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అధికార పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
కొట్టి పారేసిన ఎమ్మెల్యే..
కాగా, తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఈ విషయాన్ని నమ్మరని ఎమ్మెల్యే ఖండించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి చవక బారు ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఆడియోలో మాట్లాడిన మాటల్లో నిజం లేదని సదరు ఎమ్మెల్యే మీడియాకు స్పష్టం చేశారు.
Read more: