నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు

జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున అందించనున్నట్టు, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయనున్నట్టు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు.

Update: 2024-09-10 12:44 GMT

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున అందించనున్నట్టు, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయనున్నట్టు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ,ఇల్లు కూలి ఇతర రకాలుగా నష్టపోయిన బాధిత ప్రజలను మంగళవారం మండలంలో పర్యటించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బేల మండలంలోని సాంగిడి, బేదోడ గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్వయంగా వెళ్లి దెబ్బతిన్న ఇళ్లు, కల్వర్టులు, పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు సాంగిడి, బెదొడ గ్రామాల్లోని ప్రజలు పత్తి పంట నీట మునిగి పూర్తిగా పంట నష్టం వాటిల్లిందని, ఇళ్లలోకి నీరు వచ్చి వస్తువులు తడిచిపోయాయని, గోడలు కూలిపోయాయని వెల్లడించారు.

     అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల పంట పొలాల్లోకి నీరు చేరడం వల్ల పంటలు దెబ్బతిన్నాయని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు జిల్లాలో ఎక్కడెక్కడ పంటలకు నష్టం వాటిల్లిందో ఆ ప్రాంతాల్లో సర్వే చేసి నష్టపోయిన రైతుల వివరాలను సర్వే చేయనున్నట్టు తెలిపారు. ఆ వివరాలను ఈ నెల12 వ తేదీ లోగా నివేదికలు ప్రభుత్వానికి పంపించనున్నట్టు చెప్పారు. ఎకరానికి రూ. 10 వేల చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా ఆగస్టు 31నుండి, ఈనెల 8 వరకు ఏవైనా ఇళ్లు వర్షానికి కూలిపోతే వాటి వివరాలను తహసీల్దార్లు సేకరించి ట్రెజరీ ద్వారా డిటైల్స్ సబ్మిట్ చేస్తారని చెప్పారు. వీరికి వారి ఖాతాలో 16,500 రూపాయలు జమ చేయనున్నట్టు తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం ఒక పంట మీదనే ఆధారపడకుండా రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, ఆయిల్ ఫాం, ఇతర పంటలను వేసుకోవాలని, చెక్ డ్యామ్ లు నిర్మించుకోవాలని రైతులకు సూచించారు. ఇందులో మండల తహసీల్దార్, ఎంపీడీఓలు తదితరులు ఉన్నారు. 

Tags:    

Similar News