Kasthuri: యాక్టర్ కస్తూరి వ్యాఖ్యలపై పొంగులేటి సీరియస్
తెలుగు ప్రజలపై యాక్టర్ కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలపై పొంగులేటి సీరియస్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నటీ, తమిళనాడు బీజేపీ నేత కస్తూరి (Kasthuri Shankar) మరోసారి కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. ఈ సారి తెలుగువారిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 300 ఏళ్ల క్రితం ఓ తమిళ రాజు రాజు అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి తెలుగువారు తమిళనాడు (Tamilanadu) కు వచ్చారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో ఆమె వ్యాఖ్యలపై తెలుగు ప్రజలు భగ్గుమంటున్నారు. ఈ నేఫథ్యంలో బీజేపీ నేత, తమిళనాడు సహా ఇన్ చార్జి పొంగులేటి సుధాకర్ (Ponguleti Sudhakar Reddy) స్పందించారు. కస్తూరి వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. కస్తూరి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఆమె ఆ వ్యాఖ్యలను ఎందుకు చేశారో యధాలాపంగా అన్నారా లేక మరెవరైనా ఆమెతో అలా చెప్పించారా అనేది తెలియాల్సి ఉందన్నారు.
కస్తూరి ఏమన్నారంటే..:ఓ కార్యక్రమంలో మాట్లాడిన కస్తూరి డీఎంకే (DMK), కరుణానిధి ఫ్యామిలీ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. రాణులకు సేవలు చేయడానికి ఇక్కడికి వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదు అని చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. ఇతరుల భార్యలపై కన్నేయవద్దని బ్రాహ్మణులు చెబుతున్నందుకే ద్రవిడ (Dravida) వాదులు వాళ్లని వ్యతిరేకిస్తున్నారని, అందుకే సనాతన ధర్మాన్ని (sanathana Dharmam) డీఎంకే వ్యతిరేకిస్తోందన్నారు. తెలుగు మాట్లాడితే చాలు తమిళనాడు కేబినెట్ లో మంత్రులు అవుతున్నారని, డీఎంకే ప్రభుత్వంలో ఐదుగురు తెలుగు మంత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు.
నా వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారు: కస్తూరి
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారడంతో కస్తూరి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఇవాళ వరుస పోస్టులు చేశారు. డీఎంకే పార్టీ నా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఇలా నాపై నెగిటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తోంది. నా మెట్టినిల్లు తెలుగు, నా ఫ్యామిలీ తెలుగువాళ్లు అని తెలియక ఈ ఇడియట్స్ ఈ కామెడీ ట్రై చేస్తున్నారు. ఈ హిందూ వ్యతిరేకులు హఠాత్తుగా తెలంగాణ, ఆంధ్ర నాయకులైన రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాన్ లను ఎలా ట్యాగ్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు. తెలుగు వారు ఎంతో మంది నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని చెప్పారు.