తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వి? రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్

రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని నిలబెట్టాలని ఏఐసీసీ భావిస్తున్నది.

Update: 2024-07-08 23:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని నిలబెట్టాలని ఏఐసీసీ భావిస్తున్నది. బీఆర్ఎస్ నుంచి నాలుగేండ్ల క్రితం రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కేశవరావు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ వెంటనే ఆమోదించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ స్థానం ఖాళీ అయినట్టు నోట్ పంపారు.

దీంతో త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది. ప్రస్తుతం అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్యాబలం రీత్యా ఈసారి ఈ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశమున్నది. ఈ స్థానానికి సీనియర్ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు అభిషేక్ మను సింఘ్విని నిలబెట్టాలని ఏఐసీసీ ప్రాథమిక నిర్ణయం తీసుకున్నది. ఆయనను లాంఛనంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేస్తే గెలుపు అనివార్యమవుతుంది. ఇది ఉప ఎన్నిక కావడంతో పదవీకాలం 2026 ఏప్రిల్ వరకు కంటిన్యూ కానున్నది.

షెడ్యూల్ రిలీజ్ తర్వాత పేరు ప్రకటించే చాన్స్

గతంలో రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన సింఘ్వి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ అసెంబ్లీలో సంఖ్యాబలం రీత్యా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో ఆయన గెలవలేకపోయారు.

పార్టీకి లాయల్‌గా ఉన్న ఆయనను రాజ్యసభకు పంపించాలన్నది ఏఐసీసీ భావన. ఇప్పుడు తెలంగాణలో కేశవరావు రాజీనామాతో ఏర్పడిన ఖాళీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు (దాదాపు రెండేండ్ల పదవీకాలం) నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించే అవకాశమున్నది. మరోసారి కేశవరావుకు అవకాశం ఉండదంటూ స్పష్టమైన సంకేతాలను ఏఐసీసీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు సలహాదారు పదవిని కట్టబెట్టింది. 


Similar News