ప్రతిపాద‌న‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు!

డోర్నక‌ల్‌లో డ్రై పోర్టు ఏర్పాటు ప్రతిపాద‌న‌లు కాగితాలకే ప‌రిమిత‌మైంది. ఆరేళ్ల క్రితం డోర్నక‌ల్‌లో డ్రై పోర్టు ఏర్పాటుకు సంబంధించిన టీఎస్‌ స‌ర్వే చేసిన టీఎస్‌ఐఐసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సైతం అంద‌జేశారు.

Update: 2023-09-18 04:52 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: డోర్నక‌ల్‌లో డ్రై పోర్టు ఏర్పాటు ప్రతిపాద‌న‌లు కాగితాలకే ప‌రిమిత‌మైంది. ఆరేళ్ల క్రితం డోర్నక‌ల్‌లో డ్రై పోర్టు ఏర్పాటుకు సంబంధించిన టీఎస్‌ స‌ర్వే చేసిన టీఎస్‌ఐఐసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సైతం అంద‌జేశారు. భూ సేక‌ర‌ణ పూర్తి చేస్తే అన్నిర‌కాలుగా డోర్నక‌ల్ జంక్షన్ డ్రై పోర్టు ఏర్పాటుకు సానుకూలంగా ఉంద‌న్నది నివేదిక‌ల సారాంశం. డ్రై పోర్టుల ఏర్పాటులో రైల్వే లైన్ కనెక్టివిటీ చాలా కీలకం. ఇప్పటికే ఉన్న రైల్వే లైన్ నుంచి డ్రై పోర్టు ఉండే ప్రాంతం వరకు కూడా ప్రత్యేక లైన్‌ను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇందుకోసం కొంత మేరకు భూసేకరణ అనివార్యం. అయితే భ‌విష్యత్‌లో డోర్నక‌ల్ జంక్షన్‌కు వివిధ మార్గాల‌ను క‌లుపుతూ కొత్త లైన్లకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గద‌ర్శకాలు జారీ చేసింది.

భూపాల‌ప‌ల్లి, రామగుండం వ‌ర‌కు కొత్త లైన్ ఏర్పాటు అంశాలున్నాయి. ఇటు భ‌ద్రాచ‌లం వ‌ర‌కు కొత్త క‌నెక్టివిటీకి అవ‌కాశం ఉంది. ఈ అంశాలే డోర్నక‌ల్‌లో డ్రై ఏర్పాటుకు మొగ్గు చూపేలా చేశాయి. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా, ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాల స‌రిహ‌ద్దులో ఉన్న డోర్నక‌ల్ జంక్షన్‌లో డ్రైపోర్టు ఏర్పాటు ద్వారా పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమ‌తులు, దిగుమ‌తుల‌కు మంచి గ‌మ్యంగా అధికారులు సూచ‌న‌లు చేసిన‌ట్లు స‌మాచారం. అయితే గ‌త ఐదేళ్లుగా ప్రభుత్వం డ్రై పోర్టు ఏర్పాటుపై ఏమాత్రం దృష్టి సారించిన‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. వాస్తవానికి డ్రై పోర్టు ఏర్పాటు ద్వారా వేలాదిమందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి. అయితే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావ‌డంపై స్థానిక ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రించార‌న్న విమ‌ర్శలున్నాయి.

దీంతో డోర్నక‌ల్‌కు రావాల్సిన డ్రై పోర్టు అతీగ‌తీ లేకుండాపోయింది. డ్రై పోర్టుల ఏర్పాటు మరో వైపు పారిశ్రామిక వర్గాలు, తయారీ దారులనూ ఊరించాయి. తెలంగాణ నుంచి తమ ఉత్పత్తులను నేరుగా ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు వీలు క‌లుగుతుంద‌ని భావించాయి. ఎగుమ‌తులు, దిగుమ‌తుల‌కు ర‌వాణా భారం కొంచెమైనా త‌గ్గుతాయ‌ని, సమయం కూడా ఆదా అవుతుంద‌ని ఉమ్మడి వ‌రంగ‌ల్‌, ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాకు చెందిన వ్యాపారులు సంతోష‌ప‌డ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రతిపాద‌న‌లను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో నిరాశ చెందుతున్నారు.


Similar News