స్థానిక ఎన్నికల వేళ బీఆర్ఎస్‌లో కొత్త పంచాయితీ.. ఎటు దారి తీస్తుందోనని నేతల ఆందోళన

స్థానిక సంస్థల ఎన్నికలకు సహాయ నిరాకరణ బీఆర్ఎస్ నేతల నుంచి ఇప్పుడే మొదలైంది. భవన్ వేదికగా సమావేశాల నిర్వహణకు విముఖత చూపుతున్నారు.

Update: 2024-09-26 01:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు సహాయ నిరాకరణ బీఆర్ఎస్ నేతల నుంచి ఇప్పుడే మొదలైంది. భవన్ వేదికగా సమావేశాల నిర్వహణకు విముఖత చూపుతున్నారు. పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిన తర్వాత రివ్యూలు నిర్వహించకుండా ఇప్పుడు నిర్వహిస్తే ఏం లాభమని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధిష్టానం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా డేట్ ఫిక్స్ చేసి పిలువకుండా తామే ఎందుకు చొరవ తీసుకోవాలని పలువురు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. పదేండ్లుగా పదవులు ఇవ్వకుండా కాలయాపన చేసి ఇప్పుడు పార్టీ కోసం పనిచేయాలంటే ఎలా అని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పవర్‌లో ఉన్నపుడు పట్టించుకోలేదు!

రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ‘స్థానిక’ ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. పార్టీ మారకుండా కేడర్‌ను కాపాడుకునే పనిలో నిమగ్నమైంది. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని అనుకుంటోంది. ఏయే నియోజకవర్గాల నుంచి సమావేశం నిర్వహించాలని లీడర్లు కోరితే ఆయా సెగ్మెంట్లకు తేదీలు ప్రకటించి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే చాలా మంది అసెంబ్లీ సెగ్మెంట్లలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీల నుంచి విముఖత వ్యక్తమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ కేడర్‌లోనూ అదే భావన ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదనే అసంతృప్తే కారణమని సమాచారం. ఇప్పుడు మీటింగ్ అంటే ఎందుకు రావాలని కొందరు బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ, కేడర్ మధ్య గ్యాప్ ఉందని తెలిసినా నో రివ్యూ

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటివరకు పార్టీ అధినేత కేసీఆర్ సెగ్మెంట్ల వారీగా రివ్యూ సమావేశాలు నిర్వహించలేదు. ఓటమికి గల కారణాలను తెలుసుకోలేదు. కేడర్‌తో ముఖాముఖి మాట్లాడలేదు. పార్టీ ఎమ్మెల్యేలకు, కేడర్‌కు మధ్య గ్యాప్ ఉందని అధికారంలో ఉన్నప్పుడు అధిష్టానానికి తెలిసినా దానిపైనా రివ్యూలు నిర్వహించలేదు. కేడర్‌కు భరోసా ఇవ్వలేదు. మరోవైపు కేటీఆర్ అసెంబ్లీ ఓటమిపై పార్లమెంటు వారీగా సమీక్షలు నిర్వహించి నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కానీ వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదనే ప్రచారం జరిగింది. ఆ తప్పులను సరిదిద్దకపోవడంతోనే లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని నేతలు పేర్కొంటున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలపైనా కేసీఆర్ సమీక్షించకపోవడంపై నేతలంతా గుర్రుగా ఉన్నారు.

పార్టీకే తమ అవసరముందని లీడర్ల అభిప్రాయం!

వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కేడర్‌లో భరోసా నింపే ప్రయత్నం అధిష్టానం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. అధిష్టానం నుంచి పిలుపు రాకుండా తాము ఇప్పటి నుంచే ఖర్చు పెట్టడం ఎందుకనే ధోరణిలో నేతలు ఉన్నారు. తాము నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించాలని కోరడం ఎందుకు? పార్టీకే పట్టింపు లేనప్పుడు తామెందుకు చొరవ తీసుకోవాలనే భావనలో ఉన్నారు. మరోవైపు పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. పార్టీకి తాము అవసరం ఉంటే పిలుస్తుందని, ఇప్పుడు పార్టీకే తమ అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కేడర్‌కు కార్యాచరణ ఇవ్వకుండా.. కేవలం మీడియాకే పరిమితం అయితే ఏం లాభమనే పలువురు మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తున్న పలువురు నేతలు

బీఆర్ఎస్ కార్యకర్తలు తమకు ఏమి ఒరిగిందని కొంత నిరాశ చెందారని, తమకు ప్రత్యేకంగా ఏమీ రాలేదని బాధ పడ్డ విషయం నిజమేనని కేటీఆర్ తాజాగా పేర్కొన్నారు. అది వాస్తమేనని నేతలు అభిప్రాయపడుతున్నారు. పదేండ్లు అధికారంలో ఉన్నా పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించలేదు. పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ, అనుబంధ కమిటీలు వేయలేదు. కేవలం అధ్యక్షులను మాత్రమే నియమించింది. ఏండ్ల తరబడి పార్టీలో పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలంతా నైరాశ్యంలో ఉన్నారు. పార్టీలో ఏదో పదవి వస్తుందని ఆశించి భంగపడ్డారు. దీనికి తోడు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం, ఆ పదవి ఆశించిన లీడర్లు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇప్పుడు పార్టీకోసం పనిచేద్దామని, అందరూ కలిసి రావాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినా ఆశించిన స్పందన రాదని పార్టీ సీనియర్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తోడు ఈ మధ్య భవన్‌లో నిర్వహించిన ఒకటి రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల సమావేశాలకు సైతం ఆయా నియోజకవర్గాల నుంచి ఆశించిన స్పందన రాలేదని, ఇతర నియోజకవర్గాల నుంచి కూడా కొంతమంది నేతలు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. ‘స్థానిక’ ఎన్నికల ముందు నేతల్లో ఉన్న అసంతృప్తి ఎటు దారి తీస్తుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఎలా ముందుకు వెళ్తేందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

నల్లగొండలో మరోసారి జగదీశ్ రాజకీయం!

నల్లగొండ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓడిపోయినా నేతల్లో మాత్రం మార్పు రాలేదు. తమ ఆధిపత్యం కాపాడుకునేందుకే పాకులాడుతున్నారు తప్ప పార్టీ బలోపేతంపై దృష్టి సారించడం లేదనేది బుధవారం నల్లగొండ నేతలతో జరిగిన సమావేశం స్పష్టం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్టీకి ముఖ్య నేతలు ఉన్నారు. పార్టీ కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలకు మీటింగ్‌కు ఆహ్వానం అందలేదు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి, ఆయన అనుచరులకే ఆహ్వానం ఇచ్చారని, పార్టీలో పనిచేస్తున్నవారికి ఇన్విటేషన్ అందకపోవడంపై లీడర్లు మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 11 ఓడిపోయినా పార్టీ తీరు మారలేదని, అందరిని కలుపుకొని పోవడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉంటే పార్టీ ఎలా బలోపేతం అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు గుర్తింపు లేదని, అధికారం కోల్పోయినా అదే తీరుగా వ్యవహరిస్తుండటంతో సీనియర్ నేతలు లోలోన మధనపడుతున్నారు. ఒకవేళ మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయితే అందులో కొంతమంది నాయకులను ఎలా ఆహ్వానించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశానికి కంచర్ల రామకృష్ణా‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, పల్లె రవి కుమార్‌గౌడ్, మేడే రాజీవ్ సాగర్, రామచందర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి, సోమ భరత్ కుమార్, జూలూరి గౌరీశంకర్, నిరంజన్ వలి, వై.వెంకటేశ్వర‌రావు, చాడ కిషన్ రెడ్డి‌లు సీనియర్లుగా ఉన్నా ఆహ్వానం అందలేదని సమాచారం. అధిష్టానం పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించకుంటే ‘స్థానిక’ ఎన్నికల్లోనూ గులాబీ సత్తాచాటడం కత్తిమీద సామే. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పార్టీ బలోపేతానికి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కీలకం కానుంది.


Similar News