డైట్ అభ్యర్థులకు వెబ్ కౌన్సెలింగ్‌కు అవకాశం ఇవ్వండి.. గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్

హైదరాబాద్‌లోని డైట్ కళాశాలలో ప్రవేశానికి అభ్యర్థులకు వెబ్ కౌన్సెలింగ్ అవకాశం కల్పించాలని గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.

Update: 2024-10-25 16:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని డైట్ కళాశాలలో ప్రవేశానికి అభ్యర్థులకు వెబ్ కౌన్సెలింగ్ అవకాశం కల్పించాలని గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు, ప్రైవేట్ కళాశాలల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి జూలై 10న డీఈఈసెట్ పరీక్ష నిర్వహించారని సంఘం సభ్యులు తెలిపారు.

అయితే, ఈ నెల 23 నుంచి వెబ్ కౌన్సెలింగ్ ఉండగా.. అందులో అనుమతి పొందిన కళాశాలల జాబితాలో 9 జిల్లాలు మాత్రమే ఉన్నాయని, హైదరాబాద్ నేరెడ్‌మెట్‌కు చెందిన ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ పేరు లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. 60 ఏళ్లుగా విశిష్ట సేవలు అందిస్తున్న నేరెడ్‌మెట్ జిల్లా విద్యా శిక్షణ సంస్థను ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం మూసివేసే కుట్ర చేస్తున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఉపాధ్యాయ విద్యపై ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం అవుతోందన్నారు.

ఈ సంస్థలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్స్ మొదటి సంవత్సరంలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియంలో 50 సీట్ల చొప్పున మొత్తం 150 సీట్లున్నాయని తెలిపారు. ప్రధానంగా ఓల్డ్ సిటీకి చెందిన ముస్లిం మైనారిటీ, స్థానిక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన, ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు మెరుగైన విద్యావకాశాల కోసం డైట్ హైదరాబాద్‌పై ఆధారపడతారని తెలిపారు. ఈ కారణంగా వికారాబాద్, మహబూబ్‌నగర్ లాంటి ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అభ్యర్థులకు వెబ్ కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కస్తూరి రవీందర్, ఉపాధ్యక్షుడు జహీరుద్దీన్ కోరారు.


Similar News