41 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు : గంగుల
కోకాపేట్, ఉప్పల్ భగాయత్ భూములను 41 కులాలకు కేటాయించి ఆత్మగౌరవ భవనాల్ని నిర్మిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకొస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని, తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల విలువైన కోకాపేట్, ఉప్పల్ భగాయత్ భూములను 41 కులాలకు కేటాయించి ఆత్మగౌరవ భవనాల్ని నిర్మిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కోకాపేట్‌లో 2.5 ఎకరాల్లో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ బీసీ సంక్షేమానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందన్నారు.
కులవృత్తులకు చేయూత నిస్తూనే బలహీనవర్గాల్లో అక్షర చైతన్యం వెల్లివిరియడానికి 310 బీసీ గురుకులాలను నిర్వహిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తుందన్నారు. గతంలో దరఖాస్తు ఇచ్చి దండంపెట్టినా ఒక్క రూపాయి ఏ ప్రభుత్వం ఇవ్వలేదని, నేడు సీఎం కేసీఆర్ పెద్దకొడుకుగా పేదింటి బిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి రూపంలో లక్ష రూపాయల్ని అందిస్తున్నారని అన్నారు. అత్యధిక శాతం ఉన్న బీసీలకు ఆసరా ఫించన్లలో పెద్ద మొత్తం కేటాయిస్తూ ఆత్మగౌరవంతో జీవించేలా భరోసానిస్తున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, ట్రస్ట్ సభ్యులు, బీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.