నామినేటెడ్ పోస్టులకు 300 మంది క్యూ.. నేతల్లో హై టెన్షన్!

కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల హాడావిడి నెలకొన్నది.

Update: 2024-06-08 03:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల హాడావిడి నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 300 మంది కీలక నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. కొందరు సీఎం, మరి కొందరు మంత్రులు, ఎంపీల రిఫరెన్స్‌తో ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రుల అనుచరుల దగ్గర్నుంచి, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులంతా ఈ రేసులో ఉన్నారు. ఈ ఆశావహులంతా బయోడెటా, పార్టీ కోసం పనిచేసిన వర్క్‌ను వివరిస్తూ, తమకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని పార్టీని కోరుతున్నారు. మొదట్నుంచి పార్టీలో ఉన్నోళ్లతో పాటు, కొత్తగా చేరినోళ్లూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర కార్పొరేషన్లు, జిల్లా స్థాయిలో కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులు, మార్కెట్ కమిటీ, భద్రాచలం, యాదాద్రి, కోమరవెల్లి ఆలయ కమిటీ చైర్మన్లు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ మార్కెట్ కమిటీ, వివిధ కమిషన్లు, బోర్డులు, వంటి వాటిలో అవకాశం కల్పించాలంటూ ఆశావహులు అగ్ర నేతల చుట్టూ తిరుగుతున్నారు.

జూన్ 7 దాటింది.. మా భవిష్యత్ ఏంటో?

అసెంబ్లీ ఎన్నికలు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 37 మందిని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా ప్రకటించింది. మరో 17 మందికి కలిపి 54 మందిని చైర్మన్లుగా ప్రకటిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్నది. అయితే, అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ఆర్డర్లు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ఉన్నందున జూన్ 7న అందరికీ జీవోలు అందజేస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. కానీ, కనీసం ఒక్కరికీ ఇప్పటి వరకు ఆఫీషియల్‌గా ఆర్డర్ ఇవ్వలేదు. దీంతో తమకు ఆర్డర్ వస్తదా? లేదా? అంటూ నేతల్లో టెన్షన్ నెలకొన్నది. గతంలో టిక్కెట్ ఆశించినోళ్లు, టిక్కెట్‌ రాని నేతలూ నామినేటెడ్ పదవుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాళ్లు అరిగేలా కీలక నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కొందరైతే తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం మొదట్నుంచి పనిచేస్తున్నోళ్లు కూడా పదవుల కోసం నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని లీడర్లు చెప్తున్నారు.

మాకు చాన్స్ ఇస్తే మేలు...?

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు అండగా నిలిచినోళ్లు, ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన కీలక కేడర్‌కు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాల్సిన బాధ్యత పార్టీపై ఉంటుందని ఇటీవల టీపీసీసీ కార్యవర్గ కమిటీలోని కొందరు నేతలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల డీసీసీలు గాంధీభవన్‌కు పంపించిన పేర్ల నుంచి ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నామినేటెడ్ పోస్టుల జాబితా రెడీ అవుతుందని, క్యాస్ట్ ఈక్వెషన్స్, పార్టీలో శ్రమించిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే ఎవరెవరికి నామినేటెడ్‌లో చాన్స్ వస్తుందోనని? ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.


Similar News