సింగరేణిలో రూ.12 వేల కోట్ల అవినీతి: ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు

సింగరేణిలో దాదాపు రూ.12 వేల కోట్ల అవినీతి జరిగిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ఆరోపించారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్

Update: 2024-07-29 17:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణిలో దాదాపు రూ.12 వేల కోట్ల అవినీతి జరిగిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ఆరోపించారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్ రంగంపై జరుగుతున్న చర్చలో సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలని కోరారు. గతంలో కూడా తాను ఇదే విషయం చెప్పానని, విచారణ కమిటీ వేయాలని అడిగినట్లు గుర్తుచేశారు. విద్యుత్‌పైనే కాదు సింగరేణి సమస్యలపై మాట్లాడాలని డిమాండ్​ చేశారు.

విద్యుత్ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయడం బాగానే ఉందని, కానీ సింగరేణిలో జరిగిన అవకతవకలను కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్‌, సింగరేణిని కలిపి విచారణ చేపట్టాలని ఈ రెండింటిని వేర్వేరుగా చూడొద్దని కోరారు. విద్యుత్ ప్లాంట్లలో సబ్ క్రిటికల్ టెక్నాలజికి వెళ్లడం వెనక మతలబు ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్రంలో సింగరేణికి రూ.21వేల కోట్లు ప్రభుత్వం బకాయి ఉందని కూనంనేని తెలిపారు. సింగరేణిలో శ్రమ దోపిడి జరుగుతుందని, జీతాలు పెంచమని అడిగినందుకే గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కార్మికులను సస్పెండ్ చేయడంతో పాటు బదిలీలు చేసిందన్నారు. ఇప్పటికైనా వారందరికి న్యాయం చేయాలన్నారు. సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

సింగరేణి కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఆ సంస్థ కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు. సింగరేణి కార్మికులకు కనీసం ఉండటానికి ఇళ్లు లేవని, ప్రభుత్వం మానవత్వంతో కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలన్నారు. ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరారు.


Similar News