ప్రైవేట్‌కు పండుగే.. ఆర్టీసీకి ఎండుగే!

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆర్టీసీ సంక్రాంతి శోభను కోల్పోయింది. అసలైన పండుగ సమయంలో ఆదాయం గణనీయంగా తగ్గింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే పండుగను ప్రైవేట్‌కు అప్పగించారు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ భారీ ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. ప్రధాన రూట్లలో ఆర్టీసీ బస్సులు తిప్పకుండా సహకరించడంతో ప్రైవేట్​ ట్రావెల్స్ సంస్థలకు కలిసొచ్చింది. ఈ సంక్రాంతికి టీఎస్‌ ఆర్టీసీకి కేవలం రూ.3.30 కోట్ల ఆదాయమే వచ్చింది. ప్రతి సంక్రాంతి పండుగకు ఆర్టీసీ భారీ ఆశలు పెట్టుకుంటోంది. కానీ ఈసారి […]

Update: 2021-01-17 21:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆర్టీసీ సంక్రాంతి శోభను కోల్పోయింది. అసలైన పండుగ సమయంలో ఆదాయం గణనీయంగా తగ్గింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే పండుగను ప్రైవేట్‌కు అప్పగించారు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ భారీ ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. ప్రధాన రూట్లలో ఆర్టీసీ బస్సులు తిప్పకుండా సహకరించడంతో ప్రైవేట్​ ట్రావెల్స్ సంస్థలకు కలిసొచ్చింది. ఈ సంక్రాంతికి టీఎస్‌ ఆర్టీసీకి కేవలం రూ.3.30 కోట్ల ఆదాయమే వచ్చింది. ప్రతి సంక్రాంతి పండుగకు ఆర్టీసీ భారీ ఆశలు పెట్టుకుంటోంది. కానీ ఈసారి మాత్రం కారణాలేమైనా చేతులెత్తేసింది. 2019 సంక్రాంతి సమయంలో తెలంగాణ ఆర్టీసీకి రూ.83 కోట్ల వరకు ఆదాయం రాగా.. 2020లో రూ.94 కోట్లు వచ్చాయి. 4,900 బస్సులను తిప్పారు. కానీ ఈసారి రాష్ట్రం మొత్తంలో సంక్రాంతికి ప్రత్యేకంగా నాలుగు వేల బస్సులను తిప్పుతున్నట్లు ప్రకటించారు. దీనిలో ఏపీకి కేవలం 1,600 బస్సులకే పరిమితం చేశారు. ప్రధాన రూట్లలో బస్సులను సగానికిపైగా తగ్గించారు. ప్రైవేట్ సంస్థలకు సహకరించడంలో భాగంగానే తక్కువ బస్సులు తిప్పుతున్నారని తేలింది. అంతేకాకుండా చాలా ఆలస్యంగా రిజర్వేషన్లు తెరిచారు. దీంతో ఆర్టీసీ వైపు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. ప్రతిసారీ దాదాపు వంద కోట్ల చేరువలో వచ్చే ఆదాయం ఈసారి కేవలం రూ.3.30 కోట్లకు మాత్రమే పరిమితమైంది. ఆర్టీసీ ఆదాయం ఇంకా ప్రకటించాల్సి ఉండగా… తక్కువ రావడంతో అధికారులు సైలెంట్‌గా ఉంటున్నట్లు ఆరోపణలున్నాయి.

ప్రైవేట్‌కు భారీగా..

మరో వైపు ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఈసారి భారీ లాభాలు వచ్చినట్లు చెబుతున్నారు. సంక్రాంతి స్పెషల్ సర్వీసుల పేరుతో దాదాపు రూ.200 కోట్ల ఆదాయం వచ్చిందని అంచనా. గతేడాది ప్రైవేట్​ సర్వీసుల ఆదాయం రూ.110 కోట్లుగా ఉందని ఓ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. కానీ ఈసారి మాత్రం ఆదాయం రూ.200 కోట్లు దాటినట్లు లెక్కలు వేసుకుంటున్నారు. చాలా మేరకు ప్రైవేట్​ సంస్థలు ఐదింతలు ధరలు వసూలు చేసుకున్నాయి. ఇక ఏపీకి కూడా సంక్రాంతి సందర్భంగా భారీగానే ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం హైదరాబాద్-విజయవాడ రూట్‌లోనే రూ.2.50 కోట్లు వచ్చిందని ఏపీ అధికారులు వెల్లడించారు. కానీ తెలంగాణ ఆర్టీసీకి మాత్రం ఈ రూట్‌లో కేవలం లక్షల్లోనే ఆదాయం ఉంది. కరోనా నేపథ్యంలో రవాణా తక్కువ ఉంటుందని అనుకున్నా.. గతంలో కంటే ఈసారి ఎక్కువగానే సొంతూళ్లకు వెళ్లారని తేలింది. అయినప్పటికీ ఆర్టీసీ ఆదాయం మాత్రం తగ్గిపోయింది. ఈ నెల 8 నుంచి ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించింది. మొదటి రెండు, మూడు రోజులు కొంత మేరకు ప్రయాణికులు వచ్చినా.. ఆ తర్వాత ఆర్టీసీ బస్సుల వైపు చూడలేదు. అంతకు ముందుగానే ప్రైవేట్ బస్సుల్లో రిజర్వేషన్లు చేసేసుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు తిప్పినా ఫలితం లేకుండా పోయింది.

Tags:    

Similar News