వైరస్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయింది
దిశ, న్యూస్‌బ్యూరో: “రాష్ట్రంలో కరోనా వైరస్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయింది… ఎక్కడుందో, ఎలా ఉందో, ఎవరికి ఉందో తెలియదు. ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాలకు చేరింది. రానున్న నాలుగైదు వారాల కాలం చాలా కీలకం. మున్ముందు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండక తప్పదు. సోషల్ డిస్టెన్స్, మాస్కు, హ్యాండ్ వాష్ సూత్రాలను ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే..” అని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత కరోనా పరిస్థితులపైనా, ప్రభుత్వం తీసుకుంటున్న […]
దిశ, న్యూస్‌బ్యూరో: “రాష్ట్రంలో కరోనా వైరస్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయింది… ఎక్కడుందో, ఎలా ఉందో, ఎవరికి ఉందో తెలియదు. ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాలకు చేరింది. రానున్న నాలుగైదు వారాల కాలం చాలా కీలకం. మున్ముందు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండక తప్పదు. సోషల్ డిస్టెన్స్, మాస్కు, హ్యాండ్ వాష్ సూత్రాలను ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే..” అని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత కరోనా పరిస్థితులపైనా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైనా, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంపైనా గురువారం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. గత నాలుగైదు నెలలుగా వైద్యులు, వైద్య సిబ్బది చాలా ఒత్తిడి మధ్య పనిచేస్తున్నారని, ఇలాంటి సమయంలో కరోనా కేసులు పెరిగినాకొద్దీ ఇంకా ఒత్తిడి పెరుగుతుందని అన్నారు.
హైదరాబాద్ నగరంలో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ద్వితీయ శ్రేణి నగరాల్లో మాత్రం వైరస్ విస్తరిస్తూ ఉందన్నారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉందని తెలిపారు. “చాలా బాధాతప్తతతో చెప్పాల్సి వస్తోంది. ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాలు, జిల్లాల్లోకి కరోనా వైరస్ వ్యాపించింది. ప్రజలు తప్పకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ నగరంలో సైతం మెజారిటీ ప్రజలకు వైరస్ సోకే అవకాశం ఉంది. మూడు సూత్రాలను ప్రతీ ఒక్కరూ పాటించడం ద్వారా వైరస్ బారి నుంచి తప్పించుకోగలుగుతారు” అని అన్నారు. కరోనా వైరస్‌కు తోడుగా రానున్న కాలంలో మరిన్ని వైరస్‌లు, సీజనల్ అనారోగ్య సమస్యలు, కాలుష్య నీటితో కొన్ని రోగాలు వస్తాయని, అన్నీ కూడా జలుబు, దగ్గు, తుమ్ములు, శ్వాసకోశ సంబంధమైనవిగా ఉంటాయని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అయితే ఈ లక్షణాలను చూసి కరోనా అనే అనుమానం కలగుతుందని, అందువల్ల సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రాథమిక దశలోనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా తీవ్రమైన అనారోగ్యం బారిన పడకుండా, ఇబ్బందులు పాలు కాకుండా కాపాడుకోవచ్చని అన్నారు.
వైద్యారోగ్య శాఖలోనూ వెయ్యి మందికి పాజిటివ్
కరోనా పాజిటివ్ పేషెంట్లకు వివిధ రకాల సేవలందిస్తున్న వైద్యారోగ్య శాఖకు చెందిన సుమారు వెయ్యి మంది సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఇన్‌ఫెక్షన్ సోకిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా కరోనాతో సహజీవనం తప్పదు.. తగిన స్వీయ నియంత్రణ చర్యలు పాటించక తప్పదు అనేది ఒక జీవన విధానంగానే ఉండాలని, ప్రతీ ఒక్కరూ వాటిని పాటించాలని సూచించారు. హ్యాండ్ శానిటైజర్ తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడాలని, మామూలు సమయాల్లో హ్యాండ్ వాష్ సరిపోతుందని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆరు అడుగుల సామాజిక దూరం నిబంధనను పాటించాల్సిందేనని, మాస్కు ధరించాల్సిందేనని సూచించారు.
ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులు పెరుగుతున్నాయ్
ప్రైవేటు ఆసుపత్రులపై చాలా మంది నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నెంబర్‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని, ఊహించిదానికన్నా ఎక్కువ స్థాయిలో ప్రజల నుంచి స్పందన వస్తోందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రతీరోజు సగటున 125 ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వీటిని విశ్లేషించిన తర్వాత ప్రధానంగా నాలుగు రకాలవి ఉన్నాయని తెలిపారు. ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తుండడం, హెల్త్ ఇన్సూరెన్స్ కింద చికిత్సకు అంగీకరించకపోవడం, తప్పనిసరిగా ఛార్జీలను నగదు రూపంలోనే చెల్లించాలని డిమాండ్ చేస్తుండడం, అడ్మిషన్ కోసం వెళ్తే బెడ్‌లు లేవంటూ నిరాకరించడం అని వివరించారు. వీటి ఆధారంగా ఆయా ఆసుపత్రులపై తగిన చర్యలు తీసుకునేందుకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది చొరవ తీసుంటున్నారని తెలిపారు. ఫిర్యాదులు అందుకున్న తర్వాత వారికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడంతో పాటు, చర్యలు తీసుకున్న తర్వాత ఆ వివరాలను కూడా తెలియజేస్తున్నామన్నారు.
వైద్యుల మానసిక స్థయిర్యం దెబ్బతింటోంది : డీఎంఈ
కరోనా చికిత్సలో వైద్య సిబ్బంది శక్తికి మించి పనిచేస్తున్నారని, పని భారం పెరుగుతోందని, ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉందని పేర్కొన్న వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి తరచూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పడడం, వాటి విచారణకు హాజరుకావడం, హైకోర్టు చేస్తున్నవ్యాఖ్యలు, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వారి మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. ఇప్పటిదాకా శ్రమకు వెనకాడకుండా, వైరస్‌తో రిస్కు ఉందని తెలిసినా ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని, అందరూ మద్దతుగా నిలబడాల్సిన సమయంలో పిటిషన్లు దాఖలు కావడం వారిని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ప్రజా ప్రయోజనాలు వేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉందని, దాన్ని తప్పుపట్టడంలేదని, కానీ వాటి కారణంగా వైద్యసిబ్బందిలో తలెత్తుతున్న ఆందోళన బాధిస్తోందన్నారు.
కరోనా చికిత్సకు రూ. 150 చాలు
కరోనా లక్షణాలు ఉన్న వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే ప్రాథమిక దశలోనే అరికట్టవచ్చని, కేవలం రూ. 150కే నయం చేసుకోవచ్చన్నారు. పరీక్షలను చేయడం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని, సకాలంలో చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయం నుంచి బైటపడవచ్చన్నారు. లక్షణాలకు అనుగుణంగా యాంటీ బయాటిక్ టాబ్లెట్స్ మొదలు ఇంజెక్షన్ల వరకు అన్నీ కలిపి కేవలం రూ.150 ఖర్చుతోనే బైటపడవచ్చన్నారు. కానీ ఆలస్యం చేసినాకొద్దీ లక్షణాలు ముదిరి ఆసుపత్రిలో చేరే పరిస్థితి తలెత్తుతుందన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరమే రాదన్నారు. ప్రభుత్వమే ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నందున ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరవచ్చని సూచించారు.