కొత్త కమిషనర్ కోసం సర్కారు వేట
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ కోసం సర్కారు వేట మొదలుపెట్టింది. పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకుంటూ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా జాగ్రత్త పడుతోంది. అనుకూలమైన అధికారినే ఎన్నికల కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టాలని భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నాగిరెడ్డి పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగిసింది. ఖాళీ అయిన స్థానంలో కొత్త అధికారిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి లేఖ వెళ్లడంతో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. […]
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ కోసం సర్కారు వేట మొదలుపెట్టింది. పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకుంటూ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా జాగ్రత్త పడుతోంది. అనుకూలమైన అధికారినే ఎన్నికల కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టాలని భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నాగిరెడ్డి పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగిసింది. ఖాళీ అయిన స్థానంలో కొత్త అధికారిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి లేఖ వెళ్లడంతో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వివాదాస్పదులు కాకుండా ప్రభుత్వంతో సహకరించే వ్యక్తి కోసం ఆరా తీయడం మొదలైంది.
ఎన్నికల ప్రక్రయ పెండింగ్
త్వరలో రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఏడు మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి మొదలుకుని పోలింగ్ బూత్‌లు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సిబ్బంది, సామగ్రి వంటి అనేక పనులు ఉంటాయి. ఎన్నికల సంఘానికి కమిషనర్ లేకుండా ఈ పనులు షెడ్యూలు ప్రకారం పూర్తికావడం కష్టమైన వ్యవహారమే. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. మే నెల నుంచి కమిషనర్ పోస్టు ఖాళీగా ఉందని, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీలైనంత తొందరగా కొత్తవారిని నియమించాలని కోరింది. ఎన్నికల ప్రక్రియకు కనీసం ఆరు నెలల పాటు కసరత్తు జరగాల్సి ఉంటుందని ఆ లేఖలో వివరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ పలు విషయాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేకపోవడంతో కమిషనర్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కమిషనర్‌ను నియమించడం తక్షణావసరంగా ముందుకొచ్చింది.
ఎవరికి ఇద్దాం?
ఎస్ఈసీ కమిషనర్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇటీవల రిటైరైన ఒక అధికారిని ఎస్ఈసీ కమిషనర్‌గా పంపొచ్చంటూ ఇద్దరు మంత్రులు సూచించినట్లు తెలిసింది. కానీ సీఎం కేసీఆర్ దానికి సమ్మతించలేదని, ఏపీలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణలో జరగకుండా జాగ్రత్త పడాలని హితవు పలికినట్లు తెలిసింది. మరోవైపు సీఎం కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి సఖ్యతగా ఉన్న ఐఏఎస్‌లు రిటైరైన వెంటనే ప్రభుత్వ సలహాదారులు స్థానం మొదలు రకరకాల హోదాల్లో నియమించారు. పలు బాధ్యతలను అప్పగించారు. ఐపీఎస్‌లను కూడా ఇదే తీరులో నియమించారు. సహకార ధోరణి ఉన్నవారందరికీ పదవీ విరమణ అనంతరం ప్రభుత్వంలో ఏవో పదవులు దక్కుతూ ఉన్నాయి. అనుకూలంగా లేనివారు పదవీ విరమణ తర్వాత విశ్రాంత జీవితానికే పరిమితమయ్యారు.
ఏడాదిలోపు ఎవరు రిటైర్ అవుతున్నారు?
ప్రస్తుతం ఏడాదిలోగా పదవీ విరమణ పొందే ఐఏఎస్‌లలో అనుకూలంగా ఉండేవారి కోసం వెతుకులాట మొదలైనట్లు అధికార వర్గాల సమాచారం. ఇప్పటి నుంచే ఎస్ఈసీ కమిషనర్‌గా కొనసాగిస్తే వచ్చే ఐదేండ్లు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్‌కు అవకాశం కల్పించినట్లుగా ఉంటుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుత సీఎస్ పదవీ కాలం కూడా మూడేండ్లకు పైనే ఉంది. వచ్చే ఏడాదిలోగా రిటైర్ అయ్యే ఐఏఎస్‌లు ఎన్నికల కమిషనర్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎలాగూ సీఎస్‌గా అవకాశాలు లేకపోవడంతో ఈ పదవిలో ఐదేండ్లు ఉండవచ్చనే ఉద్దేశంతో ఎస్ఈసీ కుర్చీపై కన్నేసినట్లు భావిస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఎవరిని ఫైనల్ చేస్తారో వేచి చూడాల్సిందే.