సంక్షేమంతో ప్రజలకు మరింత చేరువగా…
ఆర్థిక మాంద్యం వెంటాడుతున్నా, కేంద్రం నుంచి సహకారం తగ్గుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమబాట మాత్రం వీడలేదు. ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. కానీ, సంక్షేమానికి వెచ్చించే నిధుల్లో మాత్రం కోత పెట్టలేదు. ప్రజలపై పన్నుభారం కూడా వేయలేదు. దీనికితోడు ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, కల్యాణలక్ష్మి, మైనారిటీల సంక్షేమం వంటి అనేక పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులను పెంచింది. పరిమిత వనరులతో సంక్షేమరంగానికి నిధుల విడుదల ఎలా సాధ్యమవుతుందన్న సందేహం ఆర్థిక శాఖ […]
ఆర్థిక మాంద్యం వెంటాడుతున్నా, కేంద్రం నుంచి సహకారం తగ్గుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమబాట మాత్రం వీడలేదు. ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. కానీ, సంక్షేమానికి వెచ్చించే నిధుల్లో మాత్రం కోత పెట్టలేదు. ప్రజలపై పన్నుభారం కూడా వేయలేదు. దీనికితోడు ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, కల్యాణలక్ష్మి, మైనారిటీల సంక్షేమం వంటి అనేక పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులను పెంచింది. పరిమిత వనరులతో సంక్షేమరంగానికి నిధుల విడుదల ఎలా సాధ్యమవుతుందన్న సందేహం ఆర్థిక శాఖ అధికారుల్లోనే వ్యక్తమైంది. కానీ, ఆర్థికమంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ చాలా ధీమాతోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమాన్ని వీడేది లేదని బడ్జెట్ ద్వారా స్పష్టం చేశారు. ప్రతీ ఎన్నికల్లోనూ వరుసగా టీఆర్ఎస్‌ను గెలిపిస్తూ వచ్చిన ప్రజలను దూరం చేసుకోరాదన్న రాజకీయ అంశమే ప్రభుత్వాన్ని ఈ దిశగా నడిపించిందనేది నిర్వివాదాంశం. సంక్షేమానికి నిధుల కేటాయింపు పెంచడం ద్వారా ప్రజల్లో అనేక సానుకూల సంకేతాలను పంపింది ప్రభుత్వం. ప్రజాదరణ ఉన్నంతవరకు అధికారానికి ఢోకాలేదనే వాస్తవానికి అనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందింది.
రాజకీయ పార్టీలకు ప్రజలు ఎప్పుడూ బంగారు గుడ్లు పెట్టే బాతులే. పార్టీల దృష్టిలో వారు బలమైన ఓటుబ్యాంకు మాత్రమే. రానున్న మూడేళ్ళ కాలంలో ఎలాంటి ఎన్నికలు లేకున్నా వారి ఆదరణను టీఆర్ఎస్ పదిలంగా ఉంచుకోవాలనుకుంటోంది. వచ్చే ఎన్నికల వరకూ దీన్ని కాపాడుకోవాలనుకుంటోంది. ఏది చేసినా అది టీఆర్ఎస్ వల్లనే సాధ్యం అనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలనుకుంటోంది. ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో సైతం ప్రజల సంక్షేమాన్ని కేసీఆర్ మర్చిపోలేదనే గట్టి సందేశాన్ని ప్రజల్లోకి ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం తీసుకెళ్ళగలిగింది. అందుకే ప్రభుత్వ భూముల్ని విక్రయించైనా సరే సంక్షేమాన్ని కొనసాగిస్తామన్న మెసేజ్‌ను ప్రజల్లోకి పంపింది. పన్నుల భారమూ లేకుండా జాగ్రత్త పడింది. ప్రజలు ఎప్పటికీ టీఆర్ఎస్ వెంటే.. టీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజల సంక్షేమం కోసమే అనే భావనను ప్రజలకు చేరవేయగలిగింది.
ఇలాంటి దీర్ఘకాల వ్యూహమే ప్రస్తుత బడ్జెట్‌ను సంక్షేమ బడ్జెట్ అనే అభిప్రాయం వచ్చేలా చేసింది. గతేడాది కూడా ఆర్థికమాంద్యం ఉంది. సంక్షేమ పథకాలకు పరిమిత వనరులతో కేటాయింపులు చేసింది. ఈసారి మాంద్యం మరింత ముదిరినా సంక్షేమానికి మాత్రం అదనపు నిధులు కేటాయించింది. దీనికితోడు ఆసరా లబ్ధిదారుల అర్హత వయసును 57 ఏళ్ళకు కుదించి మరింతమందికి ప్రయోజనం కలిగించింది. నిధులకు కటకటగా ఉన్నా పాతికవేల రూపాయల లోపు పంట రుణం ఉన్న రైతులకు ఒకే విడతలో రుణమాఫీని ఈ సంవత్సరమే అమలు చేస్తామని బడ్జెట్ ద్వారా హామీ ఇచ్చింది. మిగిలినవారికి నాలుగు విడతల్లో చేస్తామని స్పష్టత ఇచ్చింది.
రుణమాఫీ చెక్కులెందుకంటే…!
పాతికవేల రూపాయల వరకు రుణం ఉన్న రైతులకు ఒకే విడతలో రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందుకోసం రూ. 1,198 కోట్లను కేటాయించారు. దీని ద్వారా 5,83,916 మంది రైతులకు రుణం మాఫీ కానుంది. మిగిలిన రైతులకు నాలుగు విడతల్లో మాఫీ చేయనున్నట్లు ప్రకటించి తొలి విడతగా ఈ బడ్జెట్‌లో రూ. 6,225 కోట్లను కేటాయించారు. ఇక్కడే ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరించారు. గత హయాంలో రుణమాఫీని నేరుగా ప్రభుత్వమే బ్యాంకుల్లో డబ్బును జమ చేయడం ద్వారా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లోకి వెళ్ళిపోయింది. కానీ, ఈసారి మాత్రం అలా చేయకుండా లబ్ధిదారులకు నేరుగా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా చెక్కుల రూపంలో మాఫీ చేయనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా రుణం మాఫీ అయిన అనుభూతి రైతుల్లో కలగదనేది పార్టీ భావన. నేరుగా చెక్కును అందజేసినప్పుడు దాని ఫలితం పార్టీపై ప్రభావం చూపేలా ఉంటుందన్న ముందుచూపుతో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రజాదరణను పదిలంగా కాపాడుకోడానికి, మరో పార్టీవైపు వెళ్ళే ఆస్కారం లేకుండా చేయడానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభమైందని బడ్జెట్ ద్వారా స్పష్టమవుతోంది. నిజానికి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని తొలుత సమర్ధించిందీ, దాన్ని అమలు చేసిందీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అయినా ఈసారి మాత్రం ఆ విధానానికి బదులుగా చెక్కుల బాట ఎంచుకుంది. రైతుబంధు పథకాన్ని సైతం తొలి రెండు విడతల్లో చెక్కుల ద్వారానే పంపిణీ చేసింది. దాని ప్రభావాన్ని 2018 డిసెంబరు ఎన్నికల్లో పొందగలిగింది. వంద సీట్లలో గెలుపు సాధించి తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. మరో మూడేళ్ళ తర్వాత జరిగే ఎన్నికల వరకూ ఇదే టెంపోను కొనసాగించాలనుకుంటోంది.
Tags: Telangana, Welfare Schemes, Budget, Allocations, Rythubandhu, Loan waiver