social media: సోషల్ మీడియాలో బూతు కామెంట్లపై తిరుగుబాటు.. ఇక సోషల్ మీడియాకు ఆధార్ మస్ట్?
సోషల్ మీడిాయలో బూతు కామెట్లతో రెచ్చిపోతున్న వారిపై తిరుగుబాటు మొదలైంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) వినియోగం భారీగా పెరిగిపోతోంది. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని సమాజంలో డిజిటల్ కనెక్టివిటీ పెరిగింది. అదే సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎవరికి నచ్చిన అభిప్రాయాలు వారు వెల్లడించుకునే అవకాశం దొరికింది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొంత మంది నెటిజన్లు తమ బూతు పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వావి వరుసలు మరిచి విలువలకు పాతరేస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో బూతు కామెంట్లు (vulgar comments), బూతు థంబ్ నెయిల్స్ (vulgar thumbnails) తో రెచ్చిపోతున్నారు. తమ ఇంట్లో మహిళలు ఉంటారన్న సోయి కూడా లేకుండా పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నవారి పట్ల వ్యతిరేకత మొదలైంది. ఈ ధోరణిపై తాజాగా నెటిజన్ల డిజిటల్ తిరుగుబాటు మొదలుపెట్టారు. వల్గర్ కామెంట్స్, థంబ్ నెయిల్స్ పెడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆధార్ తప్పనిసరి చేయాలి:
ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా ఖాతాలు లేని వారెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. తమకు నచ్చిన అంశాలు, వాదనలు, సిద్ధాంతాలపై సోషల్ మీడియాలో నిత్యం రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొంత మంది నెటిజన్లు తమకు నచ్చని అభిప్రాయాలు, అంశాల విషయంలో బూతులతో రెచ్చిపోతున్నారు. ఇలా బూతు కామెంట్లు పెడుతున్న వారిలో కొంత మంది సమాజంలో కీలకమైన స్థానాల్లోని వారు కూడా ఉంటున్నారు. దీంతో బూతు కామెంట్లు పెడుతున్న వారి ఇళ్ల ముందు వారు రాసిన బూతు కామెంట్లతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని కొంత మంది నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఇక మరికొంత మంది యూట్యూబర్లు థంబ్ నెయిల్ జర్నలిజం పేరుతో శృతిమించి పోతున్నారు. మహిళల పట్ల డబుల్ మీనింగ్ పదాలతో, స్థాయి బేధం లేకుండా రాజకీయ నాయకులు తిట్టుకున్నారంటూ పచ్చిబూతులతో థంబ్ నెయిల్స్ పోస్టు చేస్తున్నారు. ఇలాంటి వారిలో నకిలీ అకౌంట్లతో కామెంట్స్ చేస్తున్న వారూ ఉన్నారు. దీంతో బ్యాంకు ఖాతాకు పాన్ కార్డు ఎలా తప్పనిసరి చేశారో సోషల్ మీడియా ఖాతాకు ఆధార్ కార్డు (Aadhaar card) లింక్ తప్పనిసరి చేయాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. మొత్తంగా సోషల్ మీడియాలో బూత్ బూతుపురాణాలలపై క్రమంగా వస్తున్న తిరుగుబాటు ఏమేరకు మార్పులు తీసుకురాగలదో చూడాలి మరి.