ఏపీలో విద్యుత్ ఛార్జీలపై టీడీపీ ఆందోళన

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు లేక పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే గుట్టుచప్పుడు కాకుండా శ్లాబులు మార్చి, చార్జీల మోత మోగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలల బిల్లులు రద్దు చేసి, పాత శ్లాబు విధానంలో ఛార్జీలు వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని ఆయన టీడీపీ శ్రేణులకు […]

Update: 2020-05-21 04:16 GMT

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు లేక పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే గుట్టుచప్పుడు కాకుండా శ్లాబులు మార్చి, చార్జీల మోత మోగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలల బిల్లులు రద్దు చేసి, పాత శ్లాబు విధానంలో ఛార్జీలు వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని ఆయన టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ చేస్తున్న నిరసనకు ప్రజలంతా మద్దతివ్వాలని సూచించారు.

దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ.. డబ్బు కోసం ప్రజలను పీల్చుకు తినే అలవాటు జగన్‌కు అధికారంలోకి వచ్చాక కూడా పోలేదన్నారు. లాక్‌డౌన్ కష్టాల్లో ఉన్న ప్రజలపై గుట్టుగా కరెంటు చార్జీలు పెంచి డబ్బువసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలన అంటే ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించడమే కానీ, కష్టాలపాలు చెయ్యడం కాదని హితవు పలికారు. 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేస్తే పంచాయతీలకు వేసిన పార్టీ రంగులకయ్యే ఖర్చు కంటే తక్కువే అవుతుందన్నారు. కరెంటు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన నిరసనకు మద్దతుగా నిలవాలని లోకేశ్ సూచించారు.

విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడలో టీడీపీ నేతలు కళా వెంకట్రావు, కేశినేని శ్వేత దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా కళా మాట్లాడుతూ, లాక్‌డౌన్ సమయంలో కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కరెంట్ బిల్లుల పెంపులో దొంగ లెక్కలు చెబుతున్నారన్నారు. పాత టారిఫ్ ప్రకారమే విద్యుత్ బిల్లులను వసూలు చేయాలని డిమాండ్ చేశారు.

వైజాగ్‌లో విద్యుత్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, గిడ్డి ఈశ్వరి, అనితలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ, బాబు హయాంలో విజన్ ఉండేదని అన్నారు. మూడు నెలల విద్యుత్ చార్జీలు రద్దు చేస్తూ ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చార్జీలు పెంచడం దురదృష్టకరమని అన్నారు. బాబు హయాంలో మిగుల విద్యుత్ ఉండేదని, అందుకే ధరలు పెంచలేదని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ, పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి అద్దె 5 వేలు ఉంటే, విద్యుత్ బిల్లు 6 వేలు వచ్చిందని తెలిపారు. సీఎం జగన్ పొలిటీషియన్ కాదన్న ఆమె ఆయనను బిజినెస్‌మెన్‌గా అభివర్ణించారు.

శ్రీకాకుళంలోని కోటబొమ్మాళి మండలం నిమ్మడలో ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాక్‌డౌన్ పీరియడ్ కరెంటు బిల్లులు రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. పాత స్లాబు విధానమే కొనసాగించాలి అని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని ప్రభుత్వానికి సూచించారు.

గుంటూరులో టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ ఇబ్బందుల్లో ప్రజలుంటే.. విద్యుత్ ఛార్జీలు పెంచి దోచుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిజీగా ఉందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారని అడిగితే సమాధానం చెప్పే నాధుడే లేడని ఆయన మండిపడ్డారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏంటని ఆయన నిలదీశారు.

Tags:    

Similar News