Ramprasad Reddy: లేటయినా లేటెస్ట్‌గా ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేస్తాం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ఏపీ(AP)లో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉచిత బస్​ ప్రయాణంపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

Update: 2024-12-23 03:12 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ(AP)లో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉచిత బస్​ ప్రయాణంపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా పథకాన్ని తీసుకొస్తామంటూ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Mandipalli Ramprasad Reddy) వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విశాఖపట్నంలో పర్యటించి కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని విజయవంతంగా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఒకటో తేదీన ప్రారంభించి 16న మూసేయడం తమకు ఇష్టం లేదన్నారు. ఈ పథకం విషయంలో లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామంటూ వ్యాఖ్యానించారు. పథకం అమలయ్యేనాటికి సమస్యలు అధిగమించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరూ వేలెత్తి చూపించకుండా పథకం అమలు చేస్తామని, అందుకే మంత్రులతో కూడిన సబ్‌కమిటీని ప్రభుత్వం నియమించిందని వివరించారు. త్వరలో ఆర్టీసీలోకి 1400 కొత్త బస్సులు తెస్తున్నట్లు తెలిపారు. 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు తెచ్చే యోచన ఉందన్నారు. కొత్త బస్సులతో పాటు సిబ్బందిని నియమిస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

కేబినెట్ సబ్‌ కమిటీ ఏర్పాటు

మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం కేబినెట్ సబ్‌ కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. రవాణాశాఖ మంత్రితో పాటు, హోం శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పథకం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

సమగ్ర విధానం కోసమే..

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా వరుసగా అమలు చేస్తూ వస్తోంది. పింఛన్ల పెంపు, డీఎస్సీపై సంతకం, నూతన మద్యం విధానం, అన్న క్యాంటీన్ల ఏర్పాటు ఇలా ఒక్కటొక్కటి పకడ్బందీగా అమలు చేస్తోంది. ఆర్థిక భారమైనా వెనక్కు తగ్గకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. అయితే మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ప్రారంభిస్తారా? అని అందరూ ఎదురు చూస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కొంత ఆలస్యమైనా, సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సమగ్ర నివేదికను రూపొందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం అదనంగా 2 వేల బస్సులు, 3500 మంది డ్రైవర్లు అవసరమని అధికారుల కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రతి నెలా ఆర్టీసీకి దాదాపు రూ.250 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పూర్తి అధ్యయనం కోసం కేబినెట్ ​సబ్​కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక అనంతరం ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉంది.

Tags:    

Similar News