రాష్ట్రానికి బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు వర్షాలే..!
దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ అండమాన్(South Andaman) సమీపంలో ఉపరితల ఆవర్తనం(Surface Periodicity) ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officials) వెల్లడించారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని, వెంటనే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, వీటికి తోడు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరికొన్ని జిల్లాల్లో ఎండకూడా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోమవారం కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని చెప్పారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. రైతులు, ప్రజలు చెట్ల కింద నిల్చోవద్దని, పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు ఇప్పటికే కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు తెలిపారు.