తెలంగాణలో అమిత్ షా పర్యటన అందుకే.. తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు సంబంధించి బీజేపీ స్టేట్ ఇంచార్జి తరుణ్ చుగ్ పలు కీలకవ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకే ఈనెల 17న అమిత్ షా నిర్మల్‌లో సమర శంఖారావం పూరించనున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని స్థానికంగా గల ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు సంబంధించి బీజేపీ స్టేట్ ఇంచార్జి తరుణ్ చుగ్ పలు కీలకవ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకే ఈనెల 17న అమిత్ షా నిర్మల్‌లో సమర శంఖారావం పూరించనున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని స్థానికంగా గల ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు పుట్టిన గడ్డ తెలంగాణ అని పేర్కొన్నారు. 1948 సెప్టెంబర్ 17న ఆనాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు వస్తే.. 2021 సెప్టెంబర్ 17న నేటి హోంమంత్రి అమిత్ షా రావడం ఎంతో గర్వకారణమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బులు కేసీఆర్ కుటుంబం దోచుకుతింటుందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. కేసీఆర్‌ను సాగనంపేందుకే నిర్మల్ జిల్లా కేంద్రంలో శంఖారావం పూరించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్తా అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. అంతకుముందు అమిత్ షా బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. అమిత్ షా పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నిర్మల్‌లో జరిగే సభతో టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మండలాల బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.