మృత్యుదేవతా.. నా నవ్వు ముందు నువ్వు ఎంత?
కాలిపోయిన కార్లు, కూలిపోయిన ఇండ్లు, ఆకాశాన్ని అలుముకున్న రాకాసి పొగలు, యుద్ధ విమానాల స్వైరవిహారం, బాంబుల మోత.. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో ఎవరి బతుకు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఒక రోజు, రెండు రోజులు, వారం, నెలలు కాదు.. దాదాపు తొమ్మిదేళ్లుగా స్థూలంగా సిరియా ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితి ఇది. ప్రతిరోజూ చావు బతుకుల మధ్య నలిగిపోతున్నారు వారు. ఎన్నడు గుండె నిండా ప్రశాంతంగా ఊపిరి పీల్చగలం? ఇంకెప్పుడు కంటినిండ నిద్రపోగలం? అనే ప్రశ్నలు వేసుకోవడం […]
కాలిపోయిన కార్లు, కూలిపోయిన ఇండ్లు, ఆకాశాన్ని అలుముకున్న రాకాసి పొగలు, యుద్ధ విమానాల స్వైరవిహారం, బాంబుల మోత.. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో ఎవరి బతుకు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఒక రోజు, రెండు రోజులు, వారం, నెలలు కాదు.. దాదాపు తొమ్మిదేళ్లుగా స్థూలంగా సిరియా ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితి ఇది. ప్రతిరోజూ చావు బతుకుల మధ్య నలిగిపోతున్నారు వారు. ఎన్నడు గుండె నిండా ప్రశాంతంగా ఊపిరి పీల్చగలం? ఇంకెప్పుడు కంటినిండ నిద్రపోగలం? అనే ప్రశ్నలు వేసుకోవడం కూడా మానుకున్నారేమో.. ఏ ఆశ లేకున్నా.. తల్లి, తండ్రి, బిడ్డా, సోదరుడు ఇలాంటి బంధాలే జీవించాలన్న అభిలాషను వారిలో నిలిపి ఉంచుతున్నాయేమోనని అనిపిస్తుంది. అలా అనుకోవడానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోనే కారణం.
చుట్టూ మృత్యుఘంటికలు వినిపిస్తున్నప్పుడు వాటిని సంగీతంగా వినే సాహసం చేయడం నిజంగా నైరాశ్యంలోనూ సంతోషాన్ని వెతుక్కోవడమే. ఈ వీడియోలో మూడేళ్ల సిరియన్ పాప, ఆమె తండ్రి మరణాన్నే తృణీకరించి చిరునవ్వులు చిందించారు. దానితో ఓ ఆట ఆడేసుకున్నారు. నిత్యం బాంబులు పడే ప్రమాదకర ప్రాంతంలో నివసిస్తున్న వీరు.. బాంబుల ఆధారంగా ఓ గేమ్ ఆడారు. బాంబు మోత వినిపించినా.. యుద్ధ విమానపు రంకెలను పసిగట్టినా.. ఓ నవ్వు నవ్వాలని ఆ పాపను తండ్రి కోరాడు. బయట నుంచి వస్తున్న ఆ శబ్దం… బాంబు మోసుకెళ్తున్న ‘షెల్’దా? విమానానిదా? అని ఆ చిట్టి తల్లిని అడగ్గా.. అది షెల్‌దేనని ఆడుకునే ధోరణిలోనే చెబుతుంది. అది పేలగానే.. మనం బిగ్గరగా నవ్వాలి అని కూతురుకి సూచిస్తాడు. పేలుడు శబ్దం రాగానే పాప కల్మశంలేని నవ్వు వెదజల్లుతుంది. భలే ఫన్నీగా ఉంది కదా? అని చిన్నారిని అడగ్గా ఔనని అంగీకరిస్తుంది. ఉన్నతమైన నాగరికతకు చేరుకున్నామని గర్వపడేవారికి చెంపపెట్టు ఆమె నవ్వు.
తొమ్మిదేళ్లుగా లక్షలాది మంది ప్రజలు చనిపోయారు, వలసలు వెళ్లారు. నగరాలే మట్టికరిచాయి. కానీ, ఇప్పటికీ సిరియాలో విధ్వంసం మాత్రం ఆగింది లేదు. ఈ వీడియో అక్కడి దుస్థితిని వెల్లడిస్తున్నది. నెటిజన్లు పాప నవ్వులకు హృదయం ద్రవీభవించిపోయిందని కామెంట్ చేశారు. దేవుడా వీళ్లను రక్షించవూ అని ప్రాధేయపడుతూ వ్యాఖ్యలు చేశారు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన సినిమాలో నాజీ క్యాంపులో బంధించబడిన ఓ యూదు తండ్రి.. కొడుకుతో జోకులు వేసుకుంటూ అక్కడి కర్కశత్వం నుంచి అతనిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నానికి దగ్గరగానే ఈ వీడియో ఉన్నది.
Click here for video: