ప్రైవేటు మైనారిటీ కాలేజీలకూ నీట్ వర్తిస్తుంది: సుప్రీంకోర్టు
దిశ, న్యూస్‌బ్యూరో: వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రైవేటు రంగంలోని మైనారిటీ విద్యాసంస్థలకు సైతం నీట్ ప్రవేశపరీక్ష వర్తిస్తుందని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ఎంబీబీఎస్, ఎండీ, బీడీఎస్, ఎండీఎస్ లాంటి గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల విషయంలో భాషాపరమైన, మతపరమైన ప్రైవేటు మైనారిటీ కళాశాలలు సైతం మెడికల్ కౌన్సిల్ చట్టాన్ని […]
దిశ, న్యూస్‌బ్యూరో: వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రైవేటు రంగంలోని మైనారిటీ విద్యాసంస్థలకు సైతం నీట్ ప్రవేశపరీక్ష వర్తిస్తుందని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ఎంబీబీఎస్, ఎండీ, బీడీఎస్, ఎండీఎస్ లాంటి గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల విషయంలో భాషాపరమైన, మతపరమైన ప్రైవేటు మైనారిటీ కళాశాలలు సైతం మెడికల్ కౌన్సిల్ చట్టాన్ని అమలుచేయాల్సిందేనని, నీట్ ఆధారంగానే సీట్ల భర్తీ జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 30వ అధికరణంలో పేర్కొన్న నిబంధనలు రాజ్యాంగంలోని ఇతర అధికరణాలతో విభేదించేవి కావని, అందువల్లనే ప్రైవేటు మైనారిటీ వైద్యా విద్యా సంస్థలు కూడా నీట్ ప్రవేశపరీక్ష ప్రకారమే అడ్మిషన్లను చేపట్టాలని స్పష్టం చేసింది.
మైనారిటీ విద్యా సంస్థలకు రాజ్యాంగంలోని 30వ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలు రాజ్యాంగానికి అతీతమైనవి కావని గుర్తుచేసింది. మెడికల్ కౌన్సిల్ లేదా డెంటల్ కౌన్సిల్ చట్టాల్లోని నిబంధనలు ఆర్టికల్ 30 ద్వారా సంక్రమించిన అధికారాలకు విరుద్ధమైనవేమీ కావని, అందువల్ల నీట్ ప్రవేశ పరీక్ష వీటికి కూడా వర్తిస్తుందని పేర్కొంది. విద్యా ప్రమాణాలు బాగుపడడానికి, వైద్య విద్యా సంస్థ మరింత సక్రమంగా పనిచేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది. వ్యవస్థలోని అక్రమాలను, అడ్డదారులను తొలగించి పారదర్శకంగా ఉండేందుకే ‘నీట్’ ఉనికిలోకి వచ్చిందని, భాషాపరమైన, మతపరమైన విద్యా సంస్థల నిర్వహణా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశం ఎంసీఐకు ఎక్కడా లేదని వ్యాఖ్యానించింది. మెరిట్ ఆధారంగా సీట్లను పారదర్శక పద్ధతిలో భర్తీ చేయడానికి వీలు కలుగుతుందని అభిప్రాయపడింది. ఇప్పటిదాకా మైనారిటీ విద్యా సంస్థలు ‘నీట్’ విధానాన్ని అమలుపర్చకపోవడంతో మెరిట్ లేకున్నా కాపిటేషన్ ఫీజు పేరుతో కోట్లాది రూపాయలు తీసుకుంటూ అడ్మిషన్లు ఇస్తున్నాయని, ఇప్పుడు ‘నీట్’ అమలుచేయడం ద్వారా అలాంటి అక్రమాలకు తావు ఉండదని గుర్తుచేసింది.
దీనికి తోడు మైనారిటీ విద్యాసంస్థలు కూడా నీట్ పరిధిలోకి రావడం ద్వారా ఒకే తరహా విద్యా ప్రమాణాలు ఉంటాయన్నది. విద్యను వ్యాపారీకరణ చేయడం, లాభాలను ఆర్జించడం, రకరకాల పేర్లతో కోట్లాది రూపాయలను దోచుకోవడం లాంటివన్నీ నిలువరించబడతాయని పేర్కొంది. మిగిలిన అన్ని విద్యా సంస్థల లాగానే భాషాపరమైన, మతపరమైన విద్యా సంస్థలు సమాన స్థాయిలో నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని, జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వాలకు ఉందని వ్యాఖ్యానించింది. క్రిస్టియన్ మెడికల్ కళాశాల తరఫున హాజరైన న్యాయవాది లేవనెత్తిన పలు వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. నీట్ అమల్లోకి వచ్చిన మొదటి సంవత్సరం వేలూరు సీఎంసీ కాలేజీ దాన్ని అమలు చేయలేదు. మరుసటి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ప్రవేశ పరీక్ష నిర్వహించి అడ్మిషన్లు చేపట్టింది. నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించినా అనుకూలంగా తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు దానిపై ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టమైన తీర్పును ఇచ్చింది.
సీఎంసీ వాదనలు :
గ్రామీణ ప్రాంతాల్లో సేవ అందించాలన్న ఉద్దేశంతో సీఎంసీ కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా కౌన్సిలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ, ప్రవేశ పరీక్ష లాంటివి నిర్వహిస్తోందని, నీట్ ఆధారంగా అడ్మిషన్లను చేపడితే గ్రామాల్లో పనిచేయాలనే నిబంధనకు పెట్టుకున్న స్ఫూర్తి ఉండదని న్యాయవాది ఉదహరించారు. మైనారిటీ విద్యా సంస్థలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు ప్రసాదిస్తే ఎంసీఐ చట్టంలోని సెక్షన్ 10డి మాత్రం బలవంతంగా నీట్ ప్రవేశపరీక్షను రుద్దుతున్నట్లవుతోందని పేర్కొన్నారు. మైనారిటీ విద్యా సంస్థలు ప్రత్యేకమైన ప్రవేశపరీక్షలను నిర్వహించుకుంటున్నాయని, అందువల్లనే నీట్‌ను స్వీకరించడంలేదని అన్నారు. నీట్ పరీక్షను తాము వ్యతిరేకించడంలేదని, కానీ స్వంతంగా కౌన్సిలింగ్ పెట్టుకుని అడ్మిషన్లను చేపట్టే అధికారం తమకు ఉందని పేర్కొన్నారు. నీట్ ఆధారంగా అడ్మిషన్లను నిర్వహిస్తే అభ్యర్థులు గ్రామాల్లో పనిచేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా అనేదాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకుండా పోతోందని అన్నారు.
tags: NEET, Vellore CMC College, Supreme Court, Private Minority Institutions