IND VS AUS : నాలుగో టెస్టులో ఓటమి.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు లేనట్టేనా?
నాలుగో టెస్టులో ఓటమితో టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి.
దిశ, స్పోర్ట్స్ : నాలుగో టెస్టులో ఓటమితో టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ 3వ స్థానంలో ఉన్నది. తాజాగా ఓటమితో టీమిండియా విన్నింగ్ శాతం 55.89 నుంచి 52.77కు పడిపోయింది. మరోవైపు, ఆసిస్ తమ విన్నింగ్ శాతాన్ని 61.46కు పెంచుకుని రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక పోటీపడుతున్నాయి. మెల్‌బోర్న్‌లో ఓటమితో రోహిత్ సేన ఫైనల్‌కు చేరుకునే చాన్స్‌లు తక్కువయ్యాయి. ఒక రకంగా బెర్త్ టీమిండియా చేతుల్లో లేదనే చెప్పాలి. అయితే, టైటిల్ పోరుకు అర్హత సాధించే దారులు ఇంకా మూసుకపోలేదు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో టీమిండియా కచ్చితంగా గెలవాలి. డబ్ల్యూటీసీ సర్కిల్‌లో భారత్‌కు అదే చివరి మ్యాచ్. ఓడినా, డ్రా చేసుకున్నా భారత్ ఆశలు గల్లంతైనట్టే. గెలిస్తే భారత్ విన్నింగ్ శాతం 55.26కు చేరుతుంది. అదే సమయంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో ఓడిపోవాలి. అలాగే, ఆఖరి టెస్టులో భారత్ గెలిచి.. శ్రీలంక, ఆసిస్ మధ్య రెండో టెస్టులు డ్రా అయినా టీమిండియాకు చాన్స్ ఉంటుంది. అప్పుడు భారత్, ఆస్ట్రేలియా 55.26 శాతంతో సమంగా నిలుస్తాయి. ఎక్కువ సిరీస్ విజయాల కారణంగా టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. శ్రీలంకపై కంగారులు ఒక్క మ్యాచ్‌లో గెలిచినా భారత్ ఎలిమినేట్ అవుతుంది.