రూ. 450 కోట్ల కుంభకోణంలో స్టార్ క్రికెటర్లు.. గిల్‌తోపాటు ఆ ముగ్గురు కూడా?

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ కూడా ఓ స్కాంలో ఇరుక్కున్నారు.

Update: 2025-01-02 09:54 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ చిక్కుల్లో పడ్డాడు. అతనితోపాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ కూడా ఓ స్కాంలో ఇరుక్కున్నారు. గుజరాత్‌లో సంచలనం సృష్టించిన పోంజీ కుంభకోణంలో ఈ నలుగురు పెట్టుబడులు పెట్టినట్టు తాజాగా బయటకొచ్చింది. గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ జట్టుకు గిల్ కెప్టెన్. తాజాగా పోంజీ స్కాం కేసులో వీరికి గుజరాత్ సీఐడీ సమాన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.

బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రజలను నమ్మించింది. ఏకంగా రూ.6 వేల కోట్లు సేకరించినట్టు సమాచారం. అయితే, సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో మోసపోయామని తెలుసుకున్న కొందరు మూడు నెలల క్రితం పోలీసులను ఆశ్రయించడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. రూ. 450 కోట్ల కుంభకోణం జరిగినట్టు సీఐడీ గుర్తించింది. ఈ కేసులో బీజెడ్ గ్రూపు సీఈవో భూపేంద్ర సింగ్ ఝులాను సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. తాజాగా గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ ఆ కంపెనీలో పెట్టుబడినట్టు బయటపడటం సంచలనం రేపింది.

అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం.. ఆ కంపెనీలో గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టాడు. మిగతా ప్లేయర్లు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి మధ్య ఇన్వెస్ట్ చేశారు. వారి నుంచి సీఐడీ వివరాలు సేకరించనుంది. గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత అతను భారత్‌కు రానున్నాడు. ఆ తర్వాత సీఐడీ అతన్ని విచారించనుంది. మిగతా ప్లేయర్లను విచారణకు పిలువనుంది. 

Tags:    

Similar News