Aryaman Birla : రూ.70 వేల కోట్ల ఆస్తి.. 22 ఏళ్లకే రిటైర్ అయిన భారత క్రికెటర్ ఎవరో తెలుసా?
భారత క్రికెట్‌లో ఎక్కువ ఆర్జించిన క్రికెటర్లు ఎవరంటే మనకు మనకు ఠక్కున గుర్తొచ్చేది సచిన్, ధోని, కోహ్లీలు మాత్రమే.
దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్‌లో ఎక్కువ ఆర్జించిన క్రికెటర్లు ఎవరంటే మనకు మనకు ఠక్కున గుర్తొచ్చేది సచిన్, ధోని, కోహ్లీలు మాత్రమే. ఈ ముగ్గురు ప్లేయర్లు భారత క్రికెట్‌లో తమకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుని వందల కోట్లు సంపాదించారు. కేవలం క్రికెట్‌తోనే కాకుండా ఐపీఎల్, వివిధ బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరించి ఈ మొత్తాన్ని వీరు ఆర్జించారు. అయితే ఈ ముగ్గురిని కాదని 22 ఏళ్లకే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆర్యమన్ బిర్లా రూ.70వేల కోట్ల ఆస్తితో ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్‌గా నిలిచాడు. కుమార మంగళం బిర్లా కుమారుడైన ఆర్యమన్ 2023లో ఆదిత్య బిర్లా గ్రూప్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్‌లకు డైరెక్టర్‌గా నియమితుయ్యాడు.
2017-18లో రంజీ ట్రోఫీ ఆడటం ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆర్యమన్ అరంగేట్రం చేశాడు. మధ్యప్రదేశ్ తరఫున ఆడిన ఆర్యమన్ తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రజత్ పటీదార్‌తో ఓపెనింగ్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 9 మ్యాచ్‌లు, లిస్ట్-ఏలో 4 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్‌లో 414 పరుగులు చేశాడు. ఐపీఎల్-2018 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఈ ఆటగాడిని రూ.30లక్షలకు కొనుగోలు చేసింది. రెండేళ్ల పాటు ఆ జట్టుకు ఆడినా తుది జట్టులో స్థానం దక్కించుకోలేదు. 2019 డిసెంబర్‌లో క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించిన అతను తిరిగి క్రికెట్ ఆడలేదు. అనంతరం కుటుంబానికి చెందిన వ్యాపారంలో అడుగుపెట్టిన ఆర్యమన్ బిర్లా అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం అతని నెట్ వర్త్ దాదాపు రూ.70వేల కోట్లుపైనే ఉంది. సచిన్ రూ.1100 కోట్లు, కోహ్లీ రూ.900 కోట్లు, ధోని రూ.800 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు.