Hockey : అదరగొట్టిన అమ్మాయిలు.. జూనియర్ ఆసియా కప్ భారత్ సొంతం.. వరుసగా రెండోసారి

భారత మహిళల జూనియర్ హాకీ జట్టు అదరగొట్టింది. వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది.

Update: 2024-12-15 17:52 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల జూనియర్ హాకీ జట్టు అదరగొట్టింది. వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిన భారత్ మొదటి నుంచి సత్తాచాటింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో మాజీ చాంపియన చైనాను 1-1(3-2) తేడాతో షూటౌట్‌లో చిత్తు చేసింది. మొదటి నుంచి ఇరు జట్లు గోల్స్ కోసం నువ్వానేనా అన్నట్టు తలపడటంతో మ్యాచ్ ఆసక్తికరం సాగింది. 30వ నిమిషంలో టాన్ జింజుహువాంగ్ చైనా తరపున తొలి గోల్ చేసింది. ఆ తర్వాత 41వ నిమిషంలో భారత క్రీడాకారిణి సివాచ్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేసింది. అనంతరం నిర్ణీత సమయంలోగా ఏ జట్టు మరో గోల్ చేయలేదు. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. అక్కడ చైనా రెండు గోల్స్ మాత్రమే చేయగా.. భారత్ మూడు గోల్స్ చేసి విజయం సాధించింది. ముందుగా సాక్షి, ఇషిక చెరో గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేయగా.. చివరి ప్రయత్నంలో సునేలిటా టొప్పో అద్భుతమైన గోల్‌‌తో భారత్ విజయాన్ని లాంఛనం చేసింది. దీంతో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన భారత్.. సౌత్ కొరియా, చైనా తర్వాత వరుసగా రెండుసార్లు, ఒక్కటి కంటే ఎక్కువసార్లు టైటిల్ నెగ్గిన మూడో జట్టుగా నిలిచింది


Tags:    

Similar News