Gukesh : వాటి కోసం చెస్ ఆడను.. చెస్ వరల్డ్ చాంపియన్ గుకేష్ కీలక వ్యాఖ్యలు
డబ్బు కోసం తాను చెస్ ఆడనని వరల్డ్ చాంపియన్ గుకేష్ అన్నాడు.
దిశ, స్పోర్ట్స్ : డబ్బు కోసం తాను చెస్ ఆడనని వరల్డ్ చాంపియన్ గుకేష్ అన్నాడు. అవధులు లేని తన ఆనందం కోసమే చెస్ ఆడుతున్నట్లు స్పష్టం చేశాడు. ఆదివారం ఫైడ్(అంతర్జాతీయ చెస్ సమాఖ్య)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుకేష్ మల్టీ మిలీనియర్‌గా ఉండటం అంటే ఏమిటనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘చెస్ ఆడటం ప్రారంభించనప్పుడు కుటుంబమంతా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్థిక పరంగా నా తల్లిదండ్రులు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. మేమంతా ఇప్పుడు వాటన్నింటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.’ అన్నాడు. ‘వ్యక్తిగతంగా డబ్బుల కోసం నేను చెస్ ఆడలేదు. ఇప్పటికి పిల్లాడినే. చెస్‌ను అమితంగా ప్రేమిస్తాను. చెస్ బోర్డు చూడగానే నాకు మంచి ఆట వస్తువు దొరికిందనుకుంటాను. ఆటలో ఓడిపోతే బాధ పడతాను. గొప్పగా ఆడకపోయినా.. గెలిస్తే సంతోషిస్తాను. గమ్యం ఎంత ముఖ్యమో ప్రయాణం అంతే ముఖ్యం. గొప్ప ఆటగాళ్లు సైతం తప్పులు చేస్తారు. టెక్నాలజీ ఎంత పెరిగిన చెస్ గురించి ఇంకా నేర్చుకోవాలి’. అని గుకేష్ అన్నాడు. ఇటీవల వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన గుకేష్‌కు రూ.11.45 కోట్లు ప్రైజ్ మనీ వచ్చిన విషయం తెలిసిందే.