IND-W vs WI-W : చెలరేగిన రోడ్రిగ్స్, స్మృతి మంధాన.. తొలి టీ20లో వెస్టిండీస్ చిత్తు

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది.

Update: 2024-12-15 18:33 GMT

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌‌ను భారత మహిళల క్రికెట్ జట్టు ఘనంగా మొదలుపెట్టింది. నవీ ముంబై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్(73), స్మృతి మంధాన(54) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ప్రత్యర్థిని భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఛేదనలో వెస్టిండీస్ 146/7 స్కోరుకే పరిమితమైంది. డియాండ్రా డాటిన్(52), కియానా జోసెఫ్(49) రాణించగా.. మిగతా వారు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. భారత బౌలర్లలో టిటాస్ సాధు మూడు వికెట్లు, దీప్తి శర్మ, రాధా యాదవ్ రెండేసి వికెట్లతో విండీస్‌ను నిలువరించారు.


Tags:    

Similar News