Wimbledon 2023: వింబుల్డన్ సెమీస్‌లో నోవాక్ జకోవిచ్..

స్టార్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ 8వ వింబుల్డన్ టైటిల్ సాధించే దిశగా దూసుకెళ్తున్నాడు.

Update: 2023-07-12 14:44 GMT

లండన్: స్టార్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ 8వ వింబుల్డన్ టైటిల్ సాధించే దిశగా దూసుకెళ్తున్నాడు. సెర్బియాకు చెందిన ఈ టాప్ క్రీడాకారుడు క్వార్టర్ ఫైనల్లో రష్యాకు చెందిన ఆండ్రీ రుబ్లెవ్‌ను 4-6, 6-1, 6-4, 6-3 స్కోరుతో ఓడించి వింబుల్డన్ టోర్నీలో 12వ సారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో స్థానం కోసం ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్‌తో తలపడనున్నాడు. ఈ వింబుల్డన్ ట్రోఫీ తనదేనని, కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తానని జకోవిచ్ ఆత్మవిశ్వాసం ప్రకటించాడు.

36 ఏళ్ల జకోవిచ్ మంగళవారం 400వ గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడాడు. 2013 నుంచి సెంటర్ కోర్డులో ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని రికార్డు నెలకొల్పాడు. తొలి సెట్‌లో అద్భుత విజయం సాధించిన ఏడో ర్యాంకర్ రుబ్లెవ్ తర్వాత జకోవిచ్ అనుభవానికి తలొగ్గక తప్పలేదు. వింబుల్డన్ టైటిల్ తనదేనని జకోవిచ్ ప్రకటించుకున్నప్పటికీ ప్రపంచ నెంబర్ వన్, యూఎస్ ఓపెన్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ ఇప్పటికీ బరిలోనే ఉన్నాడు.


Similar News