ఫైనల్‌కు సిద్ధంగా ఉండమన్నారు.. ఆఖరి నిమిషంలో తప్పించారు : శాంసన్

టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్ గురించి టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

Update: 2024-10-22 13:58 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ ఫైనల్‌‌లో చివరి నిమిషంలో తుది జట్టు నుంచి తనను తప్పించారని టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తెలిపాడు. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించిన టీమ్ ఇండియా 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో శాంసన్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.

తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంసన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘నాకు ఫైనల్ ఆడే అవకాశం వచ్చింది. సిద్ధంగా ఉండు నాకు చెప్పారు. నేను కూడా సిద్ధంగా ఉన్నా. కానీ, టాస్ కంటే ముందు జట్టులో మార్పులు చేయడం లేదని చెప్పారు.’ అని తెలిపాడు. ‘మ్యాచ్‌కు ముందు రోహిత్ వచ్చి ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరించాడు. ‘ముందు మ్యాచ్ గెలుద్దాం.. ఆ తర్వాత మాట్లాడుకుందాం’ అని రోహిత్ భాయ్‌కు చెప్పా. ఒక్క నిమిషం తర్వాత రోహిత్ మళ్లీ వచ్చి.. ‘నువ్వు సంతోషంగా లేవని, నన్ను తిట్టుకుంటున్నావని నాకు తెలుసు.’ అని అన్నాడు. అప్పుడు ‘ఓ క్రికెటర్‌గా టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడాలనే కోరిక ఉంది. కానీ, నువ్వు ఇలా నాకు వివరించడం సంతోషంగా ఉంది. నీలాంటి కెప్టెన్‌తో ప్రపంచకప్ ఫైనల్ ఆడే అవకాశం దక్కకపోవడం బాధపెట్టే విషయమే.’ అని బదులిచ్చానని రోహిత్‌తో జరిగిన డిస్కస్‌ను శాంసన్ బయటపెట్టాడు.

అలాగే, రోహిత్ గొప్ప సారథి అని కితాబిచ్చాడు. టాస్‌కు 10 నిమిషాల ముందు మ్యాచ్ ఆడని ప్లేయర్‌తో మాట్లాడుతున్నాడంటేనే అతనిలో గొప్ప లక్షణాలు ఉన్నాయని తనకు అర్థమైందని, అప్పుడు అతనిపై మరింత గౌరవం పెరిగిందని తెలిపాడు. 

Tags:    

Similar News