జాతీయ జట్టు నుంచి తనుష్ కొటియన్‌కు పిలుపు.. అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు?

ముంబై స్పిన్ ఆల్‌రౌండర్ తనుష్ కొటియన్‌ జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నట్టు తెలుస్తోంది.

Update: 2024-12-23 12:59 GMT

దిశ, స్పోర్ట్స్ : ముంబై స్పిన్ ఆల్‌రౌండర్ తనుష్ కొటియన్‌ జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగతా రెండు టెస్టులకు భారత జట్టులో అతనికి చోటు దక్కినట్టు సమాచారం. భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో టెస్టు అనంతరం క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపాడు. దీంతో అశ్విన్ స్థానంలో తనుష్‌ను భర్తీ చేసినట్టు తెలుస్తోంది.

దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, తనుష్ మాత్రం త్వరలోనే భారత జట్టులో చేరబోతున్నట్టు వెల్లడించాడు. ఓ జాతీయ మీడియాతో తనుష్ మాట్లాడుతూ..‘జాతీయ జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కానీ, త్వరలోనే జట్టులో చేరతా.’ అని చెప్పాడు. ఈ నెల 26 నుంచి నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. మంగళవారం తనుష్ ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం ముంబై జట్టులో భాగమైన తనుష్ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. ఆఫ్ స్పిన్నర్ అయిన అతను బంతితోపాటు బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉంది. దేశవాళీలో 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 101 వికెట్లు తీయడంతోపాటు 1,525 రన్స్ చేశాడు. అందులో రెండు శతకాలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, ఇటీవల జరిగిన వేలంలో అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు.


Tags:    

Similar News