Paris Paralympics : జూడోలో కపిల్ పర్మార్‌కు కాంస్యం.. అతని విజయం వెనుక ఓ గురువు సలహా

భారత పారా జూడోకా కపిల్ పర్మార్ పారాలింపిక్స్‌లో పురుషుల 60 కేజీల(జె1) కేటగిరీలో కాంస్య పతకం సాధించాడు.

Update: 2024-09-05 17:15 GMT

దిశ, స్పోర్ట్స్ : ఉపాధ్యాయ దినోత్సవం రోజున భారత పారా జూడోకా కపిల్ పర్మార్ పారాలింపిక్స్‌లో పురుషుల 60 కేజీల(జె1) కేటగిరీలో కాంస్య పతకం సాధించాడు. జూడోలో దేశానికి తొలి పతకం అందించి చరిత్ర సృష్టించాడు. అతని ఈ అద్భుత విజయం వెనుక తన చిన్నతనంలో ఓ ఉపాధ్యాయుడు చెప్పిన మాటే కారణం. ‘చిన్నతనంలో స్నేహితులతో ఎక్కువగా గొడవలు పడేవాడిని. అది చూసిన నా టీచర్ నీ శక్తిని ఖర్చు చేయడానికి ఏదైనా క్రీడను ఎంచుకోమని చెప్పారు.’అని కపిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. క్రీడలపై ఫోకస్ పెట్టాలన్న గురువు సూచనను అతను ఆచరణలో పెట్టాడు. ఆర్థిక సమస్య సమస్యలకుతోడు కరెంట్ షాక్‌కు గురై కంటిచూపు మందగచ్చినా.. కపిల్ అన్ని అడ్డంకులను అధిగమించి ఈ స్థాయికి ఎదిగాడు.

కపిల్ పర్మార్‌ మధ్యప్రదేశ్‌లోని శివోర్ అనే చిన్న గ్రామానికి చెందినవాడు. తండ్రి ట్యాక్సీ డ్రైవర్. ఐదుగురు సంతానంలో కపిలే చిన్నవాడు. బాల్యంలోనే జూడోపై మక్కువ పెంచుకున్న కపిల్ తన అన్నతో కలిసి శిక్షణ తీసుకున్నాడు. అయితే, చిన్నతనంలోనే కపిల్ జీవితం మలుపు తిరిగింది. పొలంలో ఆడుకుంటుండగా నీటి పంపును తాకడంతో కరెంట్ షాక్‌కు గురయ్యాడు. హాస్పిటల్‌లో ఆరు నెలలు కోమాలోనే ఉన్నాడు. ఆ ఘటన వల్ల కపిల్ కంటిచూపు బాగా మందగించింది. ఆ ప్రమాదం కపిల్ జీవితాన్ని మార్చేసింది. అయితే, జూడో పట్ల అతనికి మక్కువ అలాగే ఉంది. ఈ క్రమంలో అతను 2017లో బ్లైండ్ జూడో గురించి తెలుసుకున్నాడు. భగవాన్ దాస్, మనోజ్ మార్గదర్శకత్వంతో మెరుగయ్యాడు. అతి తక్కువ కంటిచూపు కలిగిన అథ్లెట్లు పాల్గొనే జె1 కేటగిరీలో కపిల్ పోటీపడుతున్నాడు.

సోదరుడి సహకారంతో : జూడోకాగా కపిల్ తన ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. అందులో ఆర్థిక సమస్యలు ప్రధానమైనవి. అయితే, అతనికి తన సోదరుడు లలిత్ అండగా నిలిచాడు. ఒక సమయంలో కపిల్, తన సోదరుడితో కలిసి టీ స్టాల్‌ను నడిపించాడు. కపిల్‌‌ తన కలను నెరవేర్చుకోవడంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా తన సోదరుడు చూసుకున్నాడు. 2019లో జరిగిన కామన్వెల్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడంతో కపిల్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. గతేడాది ఆసియా క్రీడల్లో రజతం సాధించాడు. అదే ఏడాది గ్రాండ్ పిక్స్‌ ఈవెంట్‌లో స్వర్ణం, వరల్డ్ గేమ్స్‌లో కాంస్యం గెలుచుకున్నాడు. 

Tags:    

Similar News