గంభీర్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు.. కోహ్లీకి చెప్పే స్థాయి రాలేదేమో అంటూ కామెంట్స్

సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో, ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ ఓటముల నేపథ్యంలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి.

Update: 2025-01-09 13:49 GMT

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో, ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ ఓటముల నేపథ్యంలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా గంభీర్‌పై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వ్యూహాత్మకంగా చాలా వెనుకబడి ఉన్నాడని, స్టార్ ప్లేయర్లను సరిచేసే స్థాయికి అతను ఇంకా చేరుకోలేదేమోనని వ్యాఖ్యానించాడు. ‘వ్యూహాత్మకంగా ఉన్నతంగా ఉండేవాడే ఉత్తమ కోచ్. పరిస్థితులకు తగ్గట్టు తుది జట్టును ఎంపిక చేయడం అతనికి తెలిసి ఉండాలి. ఆస్ట్రేలియాలాంటి జట్టును ఎదుర్కోవడానికి ఎలాంటి జట్టును తీసుకోవాలనేది కోచ్ పని. విరాట్ కోహ్లీ టెక్నిక్ సమస్యను సరిచేయలేకపోయాడు. అతనికి అంత సమయం లేకపోవచ్చు. ‘బాస్.. నీ సమస్యను అధిగమించాలంటే ఇలా ఆడు’ అని కోహ్లీకి చెప్పే స్థాయికి గంభీర్ ఇంకా చేరుకోకపోవచ్చు. అతనికి ఇంకా సమయం కావాలి. గంభీర్ వ్యూహాత్మకంగా అత్యుత్తమంగా లేడు.చాలా వెనుకబడి ఉన్నాడు.’ అని చెప్పుకొచ్చాడు.

అలాగే, గంభీర్ తప్పిదాలను ఎత్తిచూపాడు. ‘తొలి టెస్టులో అశ్విన్, జడేజాలను పక్కనపెట్టనందుకు గంభీర్ వివరణ ఇవ్వాల్సింది. బుమ్రా కారణంగానే ఆ మ్యాచ్‌ను గెలిచాం. తొలి టెస్టులో ధ్రువ్‌ను తీసుకుని ఆ తర్వాత పక్కనపెట్టారు. స్పిన్ ట్రాక్‌పై 150 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఒక్క టెస్టులోనూ ఆడించలేదు. ఆస్ట్రేలియా పిచ్‌లకు సరిపోయే ప్రసిద్ధ్ కృష్ణను కాదని హర్షిత్ రాణాను ఎందుకు తీసుకున్నారు?.’ అని గంభీర్‌ను ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వ్యూహాత్మక తప్పిదాలు జరిగాయని, భవిష్యత్తులోనైనా సరిచేసుకోవాలన్నాడు.


Tags:    

Similar News