Avani Lekhara : కారు ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడిపోయి.. అవనీ లేఖరా సక్సెస్ స్టోరీ ఇదే

అవనీ లేఖరా.. ఈ భారత మహిళా పారా షూటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-08-30 13:51 GMT

దిశ, స్పోర్ట్స్ : అవనీ లేఖరా.. ఈ భారత మహిళా పారా షూటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడేళ్ల క్రితమే ఆమె షూటింగ్‌లో సంచలనాలు సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌‌లో స్వర్ణం, కాంస్యం సాధించడంతో అవనీ పేరు మారుమోగింది. పారిస్‌లోనూ కొనసాగించిన అవనీ మళ్లీ బంగారు పతకం సాధించింది. దీంతో రెండు పారాలింపిక్స్ స్వర్ణాలు సాధించిన ఏకైక భారత మహిళా‌గా రికార్డు నెలకొల్పింది. దీంతో మరోసారి అవనీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడింది. కారు ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడిపోయి కుంగుబాటుకు గురైన స్థితి నుంచి పారాలింపిక్స్ డబుల్ గోల్డ్ మెడలిస్ట్‌గా అవనీ ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అవనీ లేఖరా పుట్టుకతోనే దివ్యాంగురాలు కాదు. 11 ఏళ్ల వయసులో ఆమె జీవితం ఓ భారీ కుదుపు లోనైంది. 2012లో జరిగిన కారు ప్రమాదంలో అవనీ నడుం కిందిభాగం చచ్చుబడిపోయింది. వీల్ చైర్‌కే పరిమితమైన అవనీ తీవ్ర కుంగుబాటుకు లోనైంది. ఈ పరిస్థితుల్లో ఆమె తండ్రి అవనీని క్రీడలపై వైపు ప్రోత్సహించాడు. మొదట ఆర్చరీలో శిక్షణ పొందింది. అయితే, భారత లెజెండరీ షూటర్ అభినవ్ బింద్రా నుంచి స్ఫూర్తిగా పొందిన అవనీ షూటింగ్‌పై మక్కువ పెంచుకుంది. షూటింగ్‌నే తన లక్ష్యంగా మార్చుకుంది. క్రమశిక్షణ, పట్టుదల, అంకుటిత దీక్షతో అవనీ సంచలనాలు నమోదు చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన ఆమె పారా షూటింగ్‌లో స్టార్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అవనీ అద్భుతం చేసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో పారాలింపిక్స్ చరిత్రలో దేశానికి తొలి బంగారు పతకం అందించిన మొదటి మహిళా అథ్లెట్‌గా తన పేరును లిఖించుకుంది. అంతేకాకుండా, అదే విశ్వక్రీడల్లో 50 మీటర్ల 3 పొజిషన్స్ ఎస్‌హెచ్ 1 కేటగిరీలో కాంస్యం సాధించడంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు కొల్లగొట్టిన ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ తర్వాత కూడా అవనీ అంతర్జాతీయ వేదికపై తన ముద్ర వేసింది. 2022లో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో రెండు బంగారు పతకాలు సాధించింది. గతేడాది చైనా వేదిక జరిగిన ఆసియా క్రీడల్లోనూ గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

ఐదు నెలల ముందు సర్జరీ

పారిస్ పారాలింపిక్స్‌‌కు ఐదు నెలల ముందు అసలు అవనీ పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొంటుందా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. మార్చిలో ఆమె పిత్తాశయానికి సర్జరీ చేయించుకోవడమే అందుకు కారణం. అయితే, శస్త్రచికిత్స నుంచి కోలుకుని, ఫామ్ అందుకోవడానికి అవనీ చాలా కష్టపడిందట. ఈ విషయాన్ని ఆమె కోచ్ చంద్ర శేఖర్ వెల్లడించారు. ‘మార్చిలో అవనీకి సర్జరీ జరిగింది. రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలన్నారు. శిక్షణ ప్రారంభించే సమయంలో ఆమె కండరాలు బలహీనంగా ఉండటం సవాల్‌గా మారింది. దీంతో మేము మొదటి నుంచి శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో బలహీన కండరాల వల్ల ఆమె శరీరం వణికేది. మెల్లిమెల్లగా కండరాలు బలపడ్డాయి. ఆ తర్వాత ఆమె లక్ష్యాలను కొద్దికొద్దిగా పెంచాం. పారిస్ క్రీడల నాటికి ఆమె ఫుల్ ఫామ్ అందుకుంది.’ అని కోచ్ చంద్రశేఖర్ వివరించారు.

Tags:    

Similar News