Women’s T20 World Cup : వెస్టిండీస్‌పై కివీస్ సంచలన విజయం.. తొలిసారిగా ఫైనల్‌కు

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Update: 2024-10-18 19:26 GMT

దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో కివీస్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. షార్జా వేదికగా శుక్రవారం జరిగిన సెమీస్‌లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 128/9 స్కోరు చేసింది. జార్జియా ప్లిమ్మెర్(33), జుజీ బేట్స్(26) జట్టుకు మంచి శుభారంభం అందించారు. ఈ తర్వాత కివీస్ వరుసగా వికెట్లు కోల్పోయి తడబడింది. ఇసాబెల్లాగాజె(20), బ్రూకె హాలిడే(18) విలువైన పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో డెయాండ్రా డాటిన్(4/22) సత్తాచాటింది. అనంతరం ఛేదనలో విండీస్‌ను కివీస్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో కరేబియన్ జట్టు 120/8 స్కోరుకే పరిమితమైంది. డెయాండ్రా డాటిన్(33) బ్యాటుతోనూ మెరిసినా.. మిగతా వారి నుంచి సహకారం కరువైంది. కివీస్ బౌలర్లలో ఎడెన్ కార్సన్(3/29), అమేలియా కెర్(2/14) ప్రత్యర్థిని నిలువరించి జట్టును గెలిపించారు. సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగే ఫైనల్‌లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకోనున్నాయి. 

Tags:    

Similar News