పోరాటమే మా వైఖరి : రోహిత్ శర్మ
టెస్టుల్లో తాము పోరాడే వైఖరిని కలిగి ఉన్నామని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
దిశ, స్పోర్ట్స్ : టెస్టుల్లో తాము పోరాడే వైఖరిని కలిగి ఉన్నామని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. టెస్టు మ్యాచ్‌లో చివరి రోజు వరకూ, చివరి ఓవర్ వరకూ పోరాడతామని చెప్పాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు ముందు మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించాడు. నాలుగో టెస్టుపైనే పూర్తి ఫోకస్ పెట్టామని, మెల్‌బోర్న్‌లో బలమైన ప్రదర్శన చేస్తామన్నాడు. ‘పెర్త్ టెస్టును గమనిస్తే మా పోరాడే వైఖరి అర్థమవుతుంది. 150 రన్స్‌కే ఆలౌటైతే జట్టుపై ఒత్తిడి ఉంటుంది. కానీ, మా కుర్రాళ్లు ఆసిస్‌ను 100 పరుగులకే కుప్పకూల్చారు. టెస్టు మ్యాచ్‌లో చివరి రోజూ లేదా చివరి ఓవర్ వరకూ మ్యాచ్‌ను వదులుకోకూడదనే వైఖరి సూచిస్తుంది. చాలా కాలంగా మేము విదేశీ పర్యటనల్లో అనుసరిస్తున్న వైఖరి అదే.’ అని చెప్పాడు. మూడు టెస్టుల తర్వాత సిరీస్‌ను పరిశీలిస్తే ఇరు జట్లు మంచి క్రికెట్ ఆడాయని తెలిపాడు. కానీ, మెల్‌బోర్న్‌లో తాము ఆధిక్యంలోకి వెళ్లాలని చూస్తున్నామని, నాలుగో టెస్టులో ఏం సాధించాలో అనే దానిపై దృష్టి పెట్టినట్టు చెప్పాడు.
అందుకే తనుష్‌ను తీసుకున్నాం
నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ గాయపడ్డాడు. నాలుగో టెస్టు ఆడతాడా? లేదా? అన్న అనుమానులకు హిట్‌మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. తన మోకాలు బాగానే ఉందని చెప్పాడు. తన బ్యాటింగ్ స్థానంపై స్పందిస్తూ.. జట్టుకు ఏది మంచిదో అదే చేస్తామన్నాడు. అలాగే, కుల్దీప్, అక్షర్‌లను కాదని తనుష్ కొటియన్‌ను తీసుకోవడంపై రోహిత్ వివరణ ఇచ్చాడు. ‘కుల్దీప్ యాదవ్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. 100 శాతం ఫిట్‌గా లేడు. అక్షర్ పటేల్ ఇటీవలే తండ్రి అవడంతో సెలెక్షన్‌కు అందుబాటులో లేడు. దాంతో తనుష్ మాకు సరైన ఆప్షన్ అనిపించింది. ఇటీవల ఆస్ట్రేలియాకు వచ్చిన భారత ఏ జట్టులో కొటియన్ సభ్యుడు. వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాకు చేరుకునే ప్లేయర్ అవసరం. తనుష్ సిద్ధంగా ఉన్నాడు. మాకు బ్యాకప్ స్పిన్నర్ కావాలి. అలాగే, బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉండటంతో తనుష్‌ను తీసుకున్నాం.’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.