ICC Rankings : వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దిశగా స్మృతి మంధాన

భీకర ఫామ్‌లో ఉన్న టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్నది.

Update: 2024-12-24 16:01 GMT

దిశ, స్పోర్ట్స్ : భీకర ఫామ్‌లో ఉన్న టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్నది. ప్రస్తుతం మహిళల వన్డే, టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆమె 2వ స్థానంలో ఉన్నది. మంగళవారం ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో మంధాన వన్డే ర్యాంకింగ్స్‌లో 2వ స్థానాన్ని కాపాడుకుంది. 739 రేటింగ్ పాయింట్లతో ఉన్న ఆమె.. అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ట్(773)కు 34 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నది. అలాగే, టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకున్న మంధాన 753 పాయింట్లతో 2వ ర్యాంక్‌కు చేరుకుంది. ఇంకా కేవలం 4 పాయింట్లు మెరుగుపడితే మంధాన ఆసిస్ బ్యాటర్ బెత్ మూనీ(757)ను వెనక్కి నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహిస్తుంది. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇతర భారత ప్లేయర్లు కూడా తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నాడు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్-10లో చోటు దక్కించుకుంది. 3 స్థానాలు అధిగమించి 10వ స్థానానికి చేరుకుంది. రోడ్రిగ్స్ 2 స్థానాలు, హర్లీన్ డియోల్ 6 స్థానాలు మెరుగుపర్చుకున్నారు. బౌలర్ రేణుక సింగ్ ఆరు స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకుంది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 6వ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.


Tags:    

Similar News