'నాకు ఎలాంటి సందేహం లేదు.. ఆ కుర్రాడు భవిష్యత్తులో టీమిండియాను ఏలుతాడు'

టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్‌గిల్‌పై బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసల జల్లు కురిపించాడు.

Update: 2023-07-17 13:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్‌గిల్‌పై బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్తులో గిల్ టీమిండియాను ఏలుతాడని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యాడు. 11 బంతుల్లో 6 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతోనే గిల్ విషలమయ్యాడనే విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌పై ఒక అభిప్రాయానికి రావడం సరికాదన్నాడు. జట్టులో ముగ్గురు ఓపెనర్లు ఉంటే ఎవరో ఒకరు నంబర్ 3లో ఆడాల్సిందే.

ఇక శుభ్‌మన్‌ గిల్‌కు ఫస్ట్ డౌన్‌లో ఆడిన అనుభవం ఉండటంతో అతనికే ఆ స్థానాన్ని కేటాయించామన్నాడు. అతని విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో టీమిండియా బ్యాటింగ్‌ను అతను శాసిస్తాడు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో సుదీర్ఘ కాలం పాటు అతను ఆడుతాడని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు. తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ సెంచరీ‌లకు చెలరేగగా.. అశ్విన్ 12 వికెట్లతో సత్తా చాటడంతో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగులతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ జూలై 20 నుంచి ప్రారంభం కానుంది.


Similar News