అప్పుడు ఆడిన వాళ్లలో ఇప్పుడు ఇద్దరమే : Virat Kohli

ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కరేబియన్ గడ్డపై తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు.

Update: 2023-07-10 14:39 GMT

న్యూఢిల్లీ : ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కరేబియన్ గడ్డపై తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. ఆంటిగ్వాలో విండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ ముందు తొలి టెస్టు డబుల్ సెంచరీ బాదడం, ఆయన తనను అభినందించడం ఫేవరెట్ మూమెంట్ అని చెప్పిన కోహ్లీ.. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. డొమినికాలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి దిగిన ఫొటోను కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ 2011లో విండీస్ గడ్డపై ఆడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.

‘2011‌లో డొమినికాలో చివరిసారిగా ఆడిన టెస్టు జట్టు నుంచి ఇద్దరం మాత్రమే ఇప్పుడు భాగమయ్యాం. విభిన్న హోదాల్లో మనం తిరిగి ఇక్కడికి వస్తామని ఊహించలేదు’ అని కోహ్లీ రాసుకొచ్చాడు. అప్పటి జట్టు నుంచి కోహ్లీ ప్లేయర్‌గా ప్రస్తుత సిరీస్‌లోనూ భాగమవ్వగా.. ద్రవిడ్ హెడ్ కోచ్ హోదాలో వచ్చాడు. ఆనాటి పర్యటనలో భాగంగా తొలి టెస్టులో భారత్ 63 పరుగులతో విజయం సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ద్రవిడ్(112) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌తోనే కోహ్లీ టెస్టుల్లో అరంగేట్రం చేయడం మరో విశేషం. మిగతా రెండు టెస్టు‌లు డ్రాగా ముగిశాయి.


Similar News