రెండో టెస్టుకు ముందు రాహుల్‌పై గంభీర్ కీలక వ్యాఖ్యలు

తొలి టెస్టులో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్నకేఎల్ రాహుల్‌కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు.

Update: 2024-10-23 17:19 GMT

దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న భారత బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. రాహుల్ ప్రతిభావంతుడని, అతనికి మద్దతు ఇస్తూనే ఉంటామని తెలిపాడు. రెండో టెస్టుకు ముందు బుధవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ పలు విషయాల గురించి మాట్లాడాడు. సోషల్ మీడియాలో రాహుల్ ట్రోలింగ్‌కు గురవడంపై స్పందిస్తూ..‘సోషల్ మీడియాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఆధారంగాగానీ, విశ్లేషకులు ఆలోచించినట్టుగానీ జట్టు ఎంపిక ఉండదు. టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన ముఖ్యం. బంగ్లాదేశ్‌తో కాన్పూర్ టెస్టులో కఠిన పరిస్థితుల్లో రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి భారీ పరుగులు చేయాలని ఉంది. అందుకే, అతనికి టీమ్ మేనేజ్‌మెంట్ మద్దతుగా ఉంటుంది.’ అని తెలిపాడు.

అలాగే, పంత్, గిల్ ఫిట్‌నెస్‌పై కూడా గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. పంత్‌కు ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేదని, గురువారం అతనే కీపింగ్ చేస్తాడని స్పష్టం చేశాడు. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరంగా ఉన్న గిల్‌ కూడా సెలెక్షన్‌కు అందుబాటులో ఉంటాడని చెప్పాడు. వాష్టింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకోవడంపై స్పందిస్తూ.. సుందర్‌తో బ్యాటింగ్ బ్యాలెన్స్ అవుతుందని, అతను తమకు మంచి ఎంపిక అని చెప్పాడు. అలాగే, ప్రత్యర్థి జట్టులో నలుగురు లేదా ఐదుగురు లెప్ట్ హ్యాండర్స్ ఉంటారని భావిస్తున్నామని, లెప్ట్ హ్యాండర్‌ నుంచి బంతిని దూరం తీసుకెళ్లాలంటే తమకు మరొక బౌలర్ అప్షన్‌గా సుందర్ ఉపయోగపడతాడని తెలిపాడు.

తొలి టెస్టు ఓటమిపై మాట్లాడుతూ..‘కాన్పూరులాంటి మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తే బెంగళూరు లాంటి మ్యాచ్‌ను కూడా అంగీకరించాలి. కానీ, ఇక్కడ సానుకూలమైన విషయం ఏంటంటే.. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే అవుటైనా మేము విజయం కోసం ప్రయత్నించాం. ఇంతకుముందే నేను చెప్పాను. మా మొదటి లక్ష్యం విజయం సాధించడమే. గెలిచే చాన్స్ లేకపోతేనే డ్రా కోసం చూస్తాం.’ అని చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News