నా కెరీర్‌లో అదే నేర్చుకున్నా: Virat Kohli
తన క్రికెట్ ప్రయాణంలో ముఖ్యంగా క్రమశిక్షణ, లైఫ్ స్ట్రైల్‌లో చాలా మార్పులు చేసుకున్నానని టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు.
ముంబై: తన క్రికెట్ ప్రయాణంలో ముఖ్యంగా క్రమశిక్షణ, లైఫ్ స్ట్రైల్‌లో చాలా మార్పులు చేసుకున్నానని టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో కోహ్లీ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మొదట్లో తనలో ఆడే విధానం, నిబద్ధత ఉన్నప్పటికీ వృత్తి నైపుణ్యం లోపించిందని విరాట్ అంగీకరించాడు. తన ఆటను మెరుగుపర్చుకునేందుకు క్రమశిక్షణ, లైఫ్ స్ట్రైల్‌లో మార్పులు చేసుకున్నానని చెప్పాడు.
జట్టు కోసం ఆడటం, కష్టాల్లో ఉన్నప్పుడు జట్టును విజయం దిశగా నడిపించడమే తన లక్ష్యమన్నాడు. ‘మనం చేసే ప్రయత్నాలను ఆట గుర్తిస్తుంది. నా కెరీర్‌లో అదే నేర్చుకున్నా. మైదానంలో నా నుంచి 100 శాతం ప్రయత్నం చేస్తాను. దేవుడు కూడా నన్ను ఆశీర్వదిస్తున్నాడు. క్రికెట్‌లో ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. నేను చేయాలనుకున్న పని గురించి కలలు కన్నాను. కానీ, ఈ విధంగానే జరగాలని కోరుకోలేదు. జీవితం ఎలా సాగాలో.. మున్ముందు ఏం జరుగుతుందోనని ఎవరూ ప్లాన్ చేయలేరు. ఇన్నేళ్లలో ఇన్ని సెంచరీలు, ఇన్ని పరుగులు చేస్తానని అనుకోలేదు.’ అని కోహ్లీ తెలిపాడు.
కాగా, వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు. టీమ్ ఇండియా తరఫున రోహిత్(398) తర్వాత టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.