కోహ్లీ ఎంతో మందికి స్ఫూర్తి : Rahul Dravid

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌లోనే కాదు దేశంలోనే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.

Update: 2023-07-20 14:14 GMT

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌లోనే కాదు దేశంలోనే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టుతో కోహ్లీ తన కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా ద్రవిడ్ స్పందిస్తూ.. ‘రికార్డు బుక్స్‌లో ఉన్న గణాంకాలే కోహ్లీ గురించి చెబుతాయి. తెర వెనుక అతను ఎంత కష్టపడతాడో నేను చూశాను. అతను ఎన్నో త్యాగాలు చేశాడు. కోహ్లీ 500 మ్యాచ్‌లు ఆడాడంటే అదే కారణం. ఇప్పటికీ త్యాగాలు చేయడానికి కోహ్లీ సిద్ధమే. ఒక కోచ్‌గా చెప్తున్నా.. అది చాలా గొప్ప గుణం.

ఎంతో మంది కుర్రాళ్లు అది చూసే స్ఫూర్తి పొందుతారు. 500 మ్యాచ్‌లు ఆడినా.. 12-13 సంవత్సరాలు క్రికెట్ ఆడుతున్నా ఆటపై ఉన్న ఉత్సాహం అతనిలో తగ్గలేదు. అతను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు. ఫిట్‌నెస్ విషయంలో టీంలో చాలా మందికి కోహ్లీ ఇన్‌స్పిరేషన్.’ అని ద్రవిడ్ తెలిపాడు. కాగా, కోహ్లీ 499 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 53.48 సగటుతో 25, 461 పరుగులు చేశాడు. అందులో 75 సెంచరీలు, 131 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన జాబితాలో సచిన్ టెండూల్కర్(664), ఎంఎస్ ధోనీ(538), రాహుల్ ద్రవిడ్(509) తర్వాత విరాట్ నిలిచాడు. మొత్తంగా వరల్డ్ క్రికెట్‌లో 10వ స్థానంలో కోహ్లీ ఉన్నాడు.


Similar News