ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో దీపికకు రజతం
ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి సత్తాచాటింది.
దిశ, స్పోర్ట్స్ : మెక్సికో వేదికగా జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి సత్తాచాటింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్‌లో రజతం సాధించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్‌లో దీపిక 6-0 తేడాతో చైనా ఆర్చర్ లీ జియామన్ చేతిలో పరాజయం పాలై సిల్వర్ మెడల్‌తో సరిపెట్టింది. టోర్నీలో సంచలన ప్రదర్శన చేసిన దీపిక.. క్వార్టర్స్‌లో 6-0 తేడాతో యాంగ్ జియాలిని(చైనా)ని ఓడించింది. సెమీస్‌లో మెక్సికోకు చెందిన అలెజాండ్రా వాలెన్సియాపై 6-4 తేడాతో గెలుపొందింది.
అయితే, ఫైనల్‌లో బోల్తాపడిన ఆమె రజతంతో సరిపెట్టాల్సి వచ్చింది. దీపికకు ఇది 6వ వరల్డ్ కప్ ఫైనల్ మెడల్. 2022 డిసెంబర్‌లో తల్లి అయిన దీపిక మూడేళ్ల తర్వాత ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చింది. పునరాగమనంలో ఆమెకు ఇదే తొలి పతకం. వరల్డ్ కప్ ఫైనల్‌లో పాల్గొనడం దీపికకు ఇది 9వ సారి. ఐదుసార్లు రజతాలు(2011, 2012, 2013, 2015, 2024), 2018లో ఓ సారి కాంస్యం గెలుచుకుంది.
టోర్నీలో ఐదుగురు ఆర్చర్లు పాల్గొనగా.. దీపిక మాత్రమే పతకం గెలిచింది. పురుషుల రిక్వర్ ఈవెంట్‌లో పాల్గొన్న తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ క్వార్టర్స్‌లోనే నిష్ర్కమించాడు. వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇప్పటివరకు డోలా బెనర్జీ మాత్రమే భారత్ తరపున స్వర్ణం గెలిచిన ఏకైక ఆర్చర్. 2007 ఎడిషన్‌లో ఆమె మహిళల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్‌లో విజేతగా నిలిచింది.