త్వరలోనే తిరిగొస్తా.. ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన షమీ
శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
దిశ, స్పోర్ట్స్ : గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న అతను ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు. ఆ సిరీస్ నాటికి ఫిట్‌నెస్ నిరూపించుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. సోమవారం ఓ ఈవెంట్‌లో పాల్గొన్న షమీ.. తన ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
ప్రస్తుతం తనకు ఎలాంటి నొప్పి లేదని తెలిపాడు. ‘ఇంతకుముందు శరీరంపై ఎక్కువ లోడ్ పడకూడదని హాఫ్ రన్ అప్ చేశాను. కానీ, నిన్న పూర్తి స్థాయి బౌలింగ్ చేశా. 100 శాతం ప్రయత్నించా. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. త్వరలోనే పునరాగమనం చేస్తానని ఆశిస్తున్నా. ప్రస్తుతం నేను 100 శాతం నొప్పి లేకుండా ఉన్నా. ఆస్ట్రేలియాకు వెళ్తానా?లేదా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆ సిరీస్ చాలా దూరంలో ఉన్నది. నన్ను నేను ఎలా ఫిట్‌గా ఉంచుకోవాలనే దానిపైనే ఫోకస్ పెట్టా. ఆస్ట్రేలియా సిరీస్‌కు అవసరమైన బలం సమకూర్చుకుంటున్నాను. ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు నేను ఫిట్‌గా ఉండి 8 నుంచి 10 రోజులు గ్యాప్ ఉంటే ఒకటి లేదా రెండు దేశవాళీ మ్యాచ్‌లు ఆడతా. నేను ఎప్పుడు ఆడతానన్నది తెలియదు. కానీ, 20-30 ఓవర్లు వేయగలిగన రోజు, డాక్టర్లు నాకు అనుమతినిచ్చిన రోజు నేను ఆడతాను. ఆసిస్ సిరీస్‌కు ముందు మైదానంలో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నా.’ షమీ చెప్పుకొచ్చాడు.
ఇటీవల షమీ గురించి కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ.. షమీ మోకాలి వాపుతో బాధపడుతున్నాడని, పూర్తిగా ఫిట్‌నెస్ సాధించకుండా అతన్ని ఆసిస్ పర్యటనకు తీసుకెళ్లడం సరైందని కాదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నవంబర్ ఆఖర్లో భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. పెర్త్ వేదికగా నవంబర్ 22న తొలి టెస్టు ప్రారంభంకానుంది.