IPL 2025 : ఐపీఎల్‌లో బోణీ కొట్టిన పంజాబ్.. గుజరాత్‌పై థ్రిల్లింగ్ విక్టరీ
ఐపీఎల్-18లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 11 రన్స్ తేడాతో విజయం సాధించింది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లోనే పంజాబ్ బోణీ కొట్టగా.. గుజరాత్ టైటాన్స్ ఓటమితో లీగ్‌ను మొదలుపెట్టింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్(97 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా.. శశాంక్ సింగ్(44 నాటౌట్), ప్రియాన్ష్ ఆర్య(47) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్(3/30) సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో గుజరాత్ 232/5 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(74), జోస్ బట్లర్(54) హాఫ్ సెంచరీలకుతోడు రూథర్‌ఫొర్డ్(46), గిల్(33) పోరాడినా ఫలితం దక్కలేదు.
గుజరాత్ పోరాడినా..
244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ గట్టిగానే పోరాడింది. ఓపెనర్లు సాయి సుదర్శన, గిల్ ఆ జట్టుకు మంచి ఆరంభం అందించారు. ముఖ్యంగా గిల్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా మెరుపులు మెరిపించాడు. దీంతో 5 ఓవర్లలో స్కోరు 50 దాటింది. అయితే, 6వ ఓవర్‌లో అతని దూకుడుకు మ్యాక్స్‌వెల్ చెక్ పెట్టాడు. అప్పటి వరకు కాస్త నిదానంగా ఆడిన సాయి సుదర్శన్ ఆ తర్వాత దూకుడు పెంచాడు. మరోవైపు, బ్యాటింగ్‌కు వచ్చిన బట్లర్ కూడా అతనికి తోడయ్యాడు. వీరిద్దరూ పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. రెండో వికెట్‌కు ఈ జోడీ విలువైన 84 రన్స్ జత చేసింది. దీంతో గుజరాత్ 145/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ క్రమంలోనే వారిద్దరూ హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేశారు. కాసేపటికే సాయి సుదర్శన్‌ను అర్ష్‌దీప్ అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అనంతరం బట్లర్‌కు రూథర్‌ఫొర్డ్ తోడయ్యాడు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించారు. దీంతో మ్యాచ్ గుజరాత్ చేతుల్లోకి వెళ్లేలా కనిపించింది. ఈ సమయంలో కెప్టెన్ అయ్యర్ యువ పేసర్ విజయ్ కుమార్ వైశాక్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించాడు. వైశాక్ అద్బుతమైన బౌలింగ్ చేశాడు. వికెట్ తీయనప్పటికీ పరుగులు కట్టడి చేసి బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో జాన్సెన్ బౌలింగ్‌లో బట్లర్ క్లీన్ బౌల్డ్ అవడంతో గుజరాత్‌కు భారీ షాక్ తగిలింది. ఆఖరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 27 రన్స్ అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా వేసిన అర్ష్‌దీప్.. రాహుల్ తెవాటియా(6), రూథర్‌ఫొర్డ్‌లను అవుట్ చేయడంతోపాటు 15 పరుగులే ఇచ్చి పంజాబ్ విజయాన్ని లాంఛనం చేశాడు.
అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్..శశాంక్ మెరుపులు
ముందుగా పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్ ప్రియాన్షు ఆర్య మెరుపు ఆరంభాన్ని అందించాడు. అతని ధాటికి మూడో ఓవర్లలో 28 పరుగులు వచ్చాయి. అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్(5) నిరాశపర్చడంతో పవర్ ప్లేలోనే తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజరాత్ బౌలర్లను ఊచకోతకోస్తూ పరుగుల వరద పారించాడు. ప్రియాన్ష్ కూడా దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో పంజాబ్ 73/1 స్కోరు చేసి బలమైన పునాది వేసుకుంది. హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న ప్రియాన్ష్ ఆర్యను రషీద్ ఖాన్ అవుట్ చేసి ఈ జోడీకి బ్రేక్ వేశాడు. ఆ తర్వాత పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మ్యాక్స్‌వెల్(0) దారుణంగా విఫలమవ్వగా.. అజ్మతుల్లా(15), స్టోయినిస్(20) ఆకట్టుకోలేకపోయారు. ఈ ముగ్గురు సాయి కిశోర్ బౌలింగ్‌లోనే వికెట్లు పారేసుకున్నారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అయ్యర్ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చివరి వరకు అజేయంగా నిలిచిన అతను 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 పరుగులు చేశాడు. స్టోయినిస్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ మెరుపులు మెరిపించాడు. అప్పటికే అయ్యర్ జోరు మీద ఉండగా గుజరాత్ బౌలర్లపై శశాంక్ పిడుగుల్లే విరుచుకపడ్డాడు. 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టిన 44 రన్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి 28 బంతుల్లో 81 రన్స్ పిండుకోవడంతో పంజాబ్ 243 స్కోరు చేసింది.
మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు
ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా, పంజాబ్ కింగ్స్ బ్యాటర్ మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డును నమోదు చేశాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో అతను డకౌటయ్యాడు. పరుగుల ఖాతా తెరకపోవడం ఇది 19వ సారి. ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు డకౌటైన ప్లేయర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఆ జాబితాలో రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ చెరో 18 సార్లు డకౌటై రెండో స్థానంలో ఉన్నారు.