కోహ్లీ ఒక్క ఇన్‌స్టా పోస్టుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
న్యూఢిల్లీ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విరాట్ ఆటను అభిమానించే వాళ్లు ఉన్నారు. రికార్డుల రారాజు, రన్‌మెషీన్‌గా పిలుచుకునే కోహ్లీ ఆటలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ కింగే. వరల్డ్‌లో అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్లు కలిగిన అథ్లెట్లలో కోహ్లీ ఒకడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి 25.5 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో కోహ్లీ పెట్టే ఒక్క పోస్టుకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇన్స్టాగ్రామ్ షెడ్యూలింగ్ టూల్ హోపర్ హెచ్‌క్యూ సర్వే ప్రకారం.. కోహ్లీ ఒక్క పోస్టుకు రూ.11.45 కోట్లు తీసుకుంటాడు.
తాజాగా హోపర్ హెచ్‌క్యూ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదించే తొలి 20 మంది జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో విరాట్ 14వ స్థానంలో ఉన్నాడు. టాప్-20లో భారత్ నుంచే కాకుండా ఆసియా నుంచి కూడా కోహ్లీ ఒక్కడికే చోటు దక్కడం విశేషం. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 29వ స్థానంలో ఉన్నది. ఆమెకు ఇన్‌స్టాలో 88.8 కోట్ల ఫాలోవర్లు ఉండగా.. ఆమె ఒక్క పోస్టుకు రూ. 4.4 కోట్లు చార్జ్ చేస్తోంది. స్టార్ ఫుట్‌బాలర్, పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో 59.6 కోట్ల ఫాలోవర్లతో టాప్ పొజిషన్లో ఉన్నాడు. అతను ఒక్క పోస్టుకు రూ. 26.7 కోట్లు తీసుకుంటున్నాడు. మరో స్టార్ ఫుట్‌బాలర్, అర్జెంటీనాకు చెందిన లియోనల్ మెస్సీ రెండో స్థానంలో ఉన్నాడు. అతనికి 47.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా.. రూ. 21.5 కోట్లు వసూలు చేస్తున్నాడు.