టీవీ ఛానళ్ల స్వీయ నియంత్రణకు త్వరలో కొత్త మార్గదర్శకాలను జారీ : Supreme Court

టీవీ ఛానళ్ల పటిష్టమైన స్వీయ నియంత్రణ కోసం త్వరలో కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది.

Update: 2023-08-14 13:29 GMT

న్యూఢిల్లీ : టీవీ ఛానళ్ల పటిష్టమైన స్వీయ నియంత్రణ కోసం త్వరలో కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. నిబంధనలను కఠినతరం చేస్తే తప్ప టీవీ ఛానళ్లు వాటిని పాటించవని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. టీవీ ఛానళ్ల స్వీయ నియంత్రణను కఠినతరం చేయాలంటూ.. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బెంచ్ విచారించింది. విచారణ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ.. "టీవీ ఛానళ్లకు స్వీయ నియంత్రణ ఉందని మీరు చెబుతున్నారు.

మీ వాదనతో ఈ కోర్టులో ఎంత మంది ఏకీభవిస్తారో నాకు తెలియదు. స్వీయ నియంత్రణ ఉల్లంఘించిన టీవీ ఛానళ్ల నుంచి మీరు ఎంత జరిమానా వసూలు చేస్తారు? ఒక లక్ష! ఒక ఛానెల్ రోజుకు ఎంత సంపాదిస్తుంది..? మీరు నిబంధనలను కఠినతరం చేయకపోతే.. ఏ టీవీ ఛానల్ కూడా వాటిని అనుసరించదు" అని పేర్కొన్నారు. టీవీ ఛానళ్ల స్వీయ నియంత్రణను బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై జస్టిస్ ఎ.కె.సిక్రి, జస్టిస్ ఆర్‌.వి. రవీంద్రన్‌ల నుంచి సలహాలు తీసుకొని కోర్టులో సమర్పించాలని ఎన్‌బీఏ తరఫు న్యాయవాదికి సీజేఐ సూచించారు. టీవీ ఛానళ్లకు స్వీయ నియంత్రణ అంశంపై, లక్ష జరిమానాపై కేంద్ర ప్రభుత్వం సమాధానాన్ని కూడా తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.


Similar News