Sunil Gavaskar: 'అతడి కెప్టెన్సీ చాలా నిరాశ పరిచింది'.. మాజీ లెజెండ్ కామెంట్స్

రోహిత్ కెప్టెన్సీపై టీమ్ ఇండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2023-07-10 12:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోహిత్ కెప్టెన్సీపై టీమ్ ఇండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ సంచలన కామెంట్స్ చేశారు. రోహిత్ కెప్టెన్సీ తనను చాలా నిరాశ పరిచిందని.. ఇప్పటి వరకు రోహిత్ కెప్టెన్సీ తనకు ఏమాత్రం నచ్చలేదన్నాడు. 'నేను రోహిత్ నుంచి ఇంకా మెరుగైన ఫలితాలు ఎక్స్‌పెక్ట్ చేశాను.. కానీ భారత్‌లో గెలవడం కాదు. ఓవర్సీస్‌లో రాణించడమే నిజమైన పరీక్ష. అక్కడే రోహిత్ ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది' అని సునీల్ గవాస్కర్ చెప్పాడు.

ఐపీఎల్‌లో వందలాది మ్యాచుల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉన్నా కూడా.. టీ20 ఫార్మాట్‌లో రోహిత్ విఫలమయ్యాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో బెస్ట్ ప్లేయర్లు ఉన్న టీం కనీసం ఫైనల్ చేరలేకపోవడం చాలా నిరాశాజనకం అని సన్నీ అన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ కెప్టెన్సీలోని టీమిండియా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విండీస్ టూర్‌లో టెస్టుల్లో కూడా రోహిత్, కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాల్సిందని, వారి స్థానాల్లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

'డబ్ల్యూటీసీ పోయింది. ఇక తర్వాతి పెద్ద టోర్నీ వన్డే వరల్డ్ కప్. ఇలాంటి టైంలో సీనియర్లకు టెస్టుల్లో పూర్తిగా విశ్రాంతి ఇచ్చేసి ఉంటే సరిపోయేది. వాళ్లను కేవలం 50 ఓవర్ల ఫార్మాట్ ఆడించాలి. కుదిరితే టీ20లు ఆడించినా మంచిదే. వాళ్లు కేవలం వైట్ బాల్ క్రికెట్ మీదనే ఫోకస్ పెడితే బాగుండేది. షమీకి విశ్రాంతి ఇచ్చారు కదా. మిగతా వారి విషయంలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సింది' అని గవాస్కర్ పేర్కొన్నాడు.


Similar News