Anrich Nortje: వరల్డ్ కప్‌కు ముందు సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ ఔట్!
ఆస్ట్రేలియాతో సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రొటిస్ స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గాయపడ్డాడు. వెన్ను నొప్పి తీవ్రతరమైన కారణంగా ఆసీస్‌తో మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ తెలిపింది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రకటన విడుదల చేసింది. శనివారం నాటి రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా అన్రిచ్ నోర్జే గాయపడ్డాడు. ఐదు ఓవర్లు వేసిన తర్వాత మైదానాన్ని వీడిన ఈ రైట్ ఆర్మ్ పేసర్.. తర్వాత తిరిగొచ్చి ఫీల్డింగ్ చేశాడు. అయితే.. నొప్పి తీవ్రం కావడంతో మెరుగైన చికిత్స కోసం.. 29 ఏళ్ల నోర్జేను సోమవారం జొహన్నస్ బర్గ్‌కు పంపినట్లు సమాచారం. ఈ క్రమంలో వైద్య పరీక్షలు జరుగుతున్న సమయంలో.. అతడు సెప్టెంబరు 12 నాటి మూడో వన్డేకు దూరం కానున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
ప్రొటిస్ కీలక పేసర్లలో ఒకడైన అన్రిచ్ నోర్జే.. త్వరలో జరిగే మెగా ఈవెంట్ వరల్డ్ కప్ నాటికి అందుబాటులోకి రాకుంటే జట్టుకు కష్టాలు తప్పవు. భారత్ వేదికగా మొదలు కానున్న ప్రపంచకప్ టోర్నీలో అక్టోబరు 7న ఢిల్లీలో శ్రీలంకతో సౌతాఫ్రికా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆసీస్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్ కాపాడుకోవాలంటే మూడో వన్డే తప్పక గెలవాల్సి ఉంది.
వన్డే వరల్డ్ కప్‌కు సౌతాఫ్రికా జట్టు:
తెంబా బవుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగలా, గెరాల్డ్ కొయెట్జీ, మార్కో జన్సెన్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్.